రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని దీని కోసం రాష్ట్రంలో మూడు రాజధానులు  ఏర్పడితే ఒకే ప్రాంతం కాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని నిర్ణయించిన జగన్ సర్కార్  3 రాజధానిల ప్రకటన చేసింది.. ఇక మూడు రాజధానిల  ప్రకటన చేసినప్పటి నుంచి విపక్ష పార్టీల నుంచి ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎక్కడ వెనకడుగు వేయకుండా చివరికి 3 రాజధాని లకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం ముద్ర వేయించింది  జగన్ సర్కార్. అయితే అసెంబ్లీలో వైసీపీ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉండడంతో 3రాజధాని లకు సంబంధించిన బిల్లు శాసనసభలో సులభంగానే ఆమోద ముద్ర పొందింది. కానీ అసెంబ్లీలో ఆమోదం పొందిన అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో ఆమోద ముద్ర వేయించడం మాత్రం అధికార వైసిపి పార్టీకి పెద్ద సవాలుగా మారింది అని చెప్పాలి. 

 

 

 నిన్న వికేంద్రీకరణ కు సంబంధించిన బిల్లు శాసన మండలి లోకి రాగా  టిడిపి సభ్యులందరూ తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టారు. రూల్ 71 ప్రకారమే చర్చ జరపాలంటూ డిమాండ్ చేశారు... ఈ క్రమంలోనే వైసీపీ మంత్రులు శాసన మండలి ఛైర్మన్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. కాగా  నిన్న శాసనమండలి సమావేశం మొత్తం రసాభాసగా మారి పోయింది. అయితే టీడీపీ  నేతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టకుండా అడ్డుకుంటామని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెండవ రోజు కూడా వికేంద్రీకరణ కు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టకుండా రసాభాస సృష్టించారు టిడిపి సభ్యులు. 

 

 

 

 అయితే శాసనమండలిలో తమ సభ్యుల సంఖ్య తక్కువగా ఉండటం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని భావించిన జగన్ సర్కార్.. శాసనమండలిలో బిల్లు ఆమోదం పొందేందుకు బిజెపి మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్సీలతో మంత్రి బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. మూడు రాజధాని లకు సంబంధించిన బిల్లుకు శాసనమండలిలో మద్దతు ఇవ్వాలంటూ మంత్రి బొత్స సత్యనారాయణ బిజెపి ఎమ్మెల్సిలను కోరారు. అయితే పార్టీ విధానమే తమ విధానమని బిజెపి ఎమ్మెల్యేలు బొత్స సత్యనారాయణకు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అటు మండలిలో ఏడుగురు పిడిఎఫ్ ఎమ్మెల్సీలు అమరావతి కి మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ కు శాసనమండలిలో బిల్లుకు ఆమోద ముద్ర వేయించడం మరింత క్లిష్టంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: