ఈరోజు ఉదయం 7 గంటలకు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మొదలైంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. మొత్తం 9 కార్పొరేషన్లకు, 120 మున్సిపాలిటీలకు పోలింగ్ జరిగింది. చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 362 డివిజన్లలో, 2647 వార్డులకు పోలింగ్ జరిగింది. 12,843 మంది అభ్యర్థులు ఈరోజు జరిగిన ఎన్నికల్లో పోటీ చేశారు.                                       
 
ఈ ఎన్నికల్లో 80 వార్డులు, 3 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవమైన వార్డులను, డివిజన్లను మినహాయించి మిగతా అంతటా పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలో ఉన్నవాళ్లకు మాత్రం ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. ఈ నెల 24వ తేదీన కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రం ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వం ఎన్నికలు జరిగే ప్రాంతాలలో ఉద్యోగులకు మరియు కార్మికులకు సెలవు ప్రకటించింది. 
 
7613 పోలింగ్ కేంద్రాల్లో ఈరోజు పోలింగ్ జరిగింది. ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు వచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు సైతం ఓటు హక్కును వినియోగించుకుని ఓటుతోనే ప్రజాస్వామ్యం బలపడుతుందని పేర్కొన్నారు. పలు ప్రాంతాలలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోగా పోలీసుల రంగప్రవేశంతో పలుచోట్ల లాఠీఛార్జ్ జరిగింది. 
 
ఈరోజు ఉదయం పోలింగ్ మందకొడిగా సాగింది. మధ్యాహ్నం సమయానికి పోలింగ్ పుంజుకుంది. మున్సిపల్ పోరు బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తమైంది. గెలుపుపై అన్ని పార్టీల అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు 75 శాతం పోలింగ్ నమోదైంది. కొన్నిచోట్ల దొంగఓట్లు వేసేందుకు వచ్చిన వారిని స్థానికులు గుర్తించి దేహశుధ్ధి చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: