ఢిల్లీ ఉట్టి కొట్టాలని బీజేపీ బలంగా నిర్ణయించుకుంది. కేజ్రీవాల్ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి 40 మంది స్టార్ క్యాంపైనర్లను రంగంలోకి దించుతోంది. ఇరవై రోజుల పాటు 40 మంది కాషాయ నేతలు ఢిల్లీని చుట్టేయనున్నారు. ప్రధాని మోడీ నుంచి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దాకా.. అంతా హస్తినపై బీజేపీ జెండా ఎగరేయాలని కంకణం కట్టుకున్నారు. 

 

2015లో ఢిల్లీలో కేవలం మూడు అసెంబ్లీ సీట్లు గెలిచిన బీజేపీ.. ఈసారి మాత్రం పీఠం దక్కించుకోవాలని పావులు కదుపుతోంది. ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కొన్ని నెలల కాలంగా కేజ్రీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కూడా జనంలోకి వెళ్లాయనే వాదన ఉంది. దీంతో బీజేపీ అలర్టైంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీలో గెలిచి తీరాలని బలమైన ప్రచార వ్యూహం రెడీ చేస్తోంది. 

 

ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, నితిన్ గడ్కరీతో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు కూడా క్యాంపైనింగ్ చేయబోతున్నారు. పార్టీ పోస్టర్ బాయ్ గా పేరున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర నేతల బృందాన్ని లీడ్ చేస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే 20 రోజుల్లో ఢిల్లీలో కొత్త తరహాలో ప్రచారం ఉంటుందని అంటున్నాయి. 

 

అయితే అగ్రనేతలందరూ ఢిల్లీయేతరులే కావడం మరో విశేషంగా చెప్పుకోవాలి. ఇప్పటికే కేజ్రీవాల్ బీజేపీకి సీఎం అభ్యర్థి కూడా లేరని విమర్శిస్తున్నారు. అయితే బీజేపీ కొన్ని సందర్భాల్లో తప్ప.. ఎప్పుడూ సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించిన చరిత్ర లేదని కమలనాథులు దీటుగా కౌంటరిస్తున్నారు. మరి అగ్రనేతల ప్రచారం బీజేపీకి ఏ మేరకు ఉపకరిస్తుందనేది చూడాల్సి ఉంది. మొత్తానికి బీజేపీ ఎలాగానై హస్తినలో అధికార పీఠం ఎక్కాలని వ్యూహాలు రచిస్తోంది. అందుకే ప్రచారంలో కొత్త దనాన్ని చూపి ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నమైంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: