తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. ప్రముఖ పారిశ్రామిక గ్రూప్ పిరమాల్, ప్రస్తుతం రాష్ట్రంలో తనకున్న పిరమల్ ఫార్మా ఫెసిలిటీ బలోపేతం చేస్తూ, విస్తరించేందుకు సుమారు 500 కోట్ల రూపాయలను రానున్న మూడు సంవత్సరాల్లో పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఈ రోజు ప్రకటించింది. పిరమాల్ గ్రూప్  చైర్మన్ అజయ్ పిరమాల్‌తో మంత్రి కే. తారకరామారావు దావోస్ లో సమావేశం అయిన అనంతరం సంస్థ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. గ్రూప్ తెలంగాణ రాష్ట్రానికి ఇంత భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం పట్ల మంత్రి కేటీఆర్ సంస్థకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వం నుంచి సంస్థకు కావలసిన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు.  ప్రస్తుతం తెలంగాణలో తనకున్న ఫార్మా యూనిట్  విస్తరణలో భాగంగా  నూతన తయారీ బ్లాకులు ఏర్పాటు, వేస్ హౌస్ విస్తరణ వంటివాటికి ఈ ఐదు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు పిరమాల్ గ్రూప్ తెలిపింది.

 

ప్రస్తుతం తన ప్లాంట్ విస్తరణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్లాంట్లను కూడా హైదరాబాద్కి తరలించే అవకాశాలను పరిశీలిస్తామని పిరమాల్ గ్రూప్ తెలిపింది. తెలంగాణలో ఉన్న పరిశ్రమల  అనుకూల ప్రభుత్వం, దాని పాలసీలను పరిగణలోకి తీసుకొని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. దీంతోపాటు హైదరాబాద్ నగరంలో ఉన్న ఇతర కంపెనీలను కూడా  కొనుగోలు చేసి తన తయారీ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.  తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా, హెల్త్ కేర్, సురక్షిత తాగునీరు, డిజిటల్ విలేజ్ వంటి కార్యకలాపాలు చేపట్టనున్నట్లు తెలిపింది. 

 

ప్రస్తుతం తెలంగాణలో కంపెనీకి అన్ని అనుమతులు కలిగిన మూడు తయారీ బ్లాకులు ఉన్నాయని, జీరో డిశ్చార్జ్ విధానంలో, పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించని ఈ విధంగా తమ పిరమాల్ గ్రూప్ పనిచేస్తుందని తెలిపారు. హెల్త్ కేర్ రంగంలో ఇప్పటికే 1400 మంది ఉద్యోగులు ఉన్నారని, ప్రస్తుత 500 కోట్ల రూపాయల అదనపు పెట్టుబడి ద్వారా మరో 500 మందికి పైగా ఉద్యోగాలు కల్పించే అవకాశం లభిస్తుందని తెలిపింది.  ఈ పెట్టుబడి ద్వారా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన మందుల తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. నూతన ప్లాంట్ రాబోతున్న స్థలాన్ని సందర్శించేందుకు వచ్చేనెలలో  తెలంగాణలో పిరమాల్ గ్రూప్ సీనియర్ ప్రతినిధి బృందం పర్యటిస్తుందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: