మందలగిరి మాలోకం అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై రకరకాల సెటైర్లు ఇప్పటికీ పడుతూనే ఉన్నాయి. అయినా తనని తాను నిరూపించుకునే విషయంలో లోకేష్ విఫలమవుతూ వస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ తమ ఆశ, శ్వాస అమరావతి అన్నట్టుగా వైసీపీ ప్రభుత్వం పై అలుపెరగకుండా పోరాడుతూ వస్తోంది. ఇటువంటి కీలక సమయంలో తన టాలెంట్ ను చూపించే అవకాశాన్ని లోకేష్ చేజేతులా  పోగొట్టుకుంటున్నాడు. తన తండ్రి చంద్రబాబు అలుపెరగకుండా రాజధానిపై పోరాడుతుంటే.. లోకేష్ మాత్రం తనకు సంబంధం లేదు అన్నట్టుగా ఈ వ్యవహారంపై పెద్దగా స్పందించడం లేదు.


 తాజాగా శాసనమండలిలోనూ ఇదే రకమైన వ్యవహారశైలిని లోకేష్ కనబరిచారు. వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేసే క్రమంలో లోకేష్ తన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ చూస్తూ నవరత్నాలు కోసం మసీదు, చర్చిల భూములు అమ్మెందుకు ప్రభుత్వం జీవో ఇచ్చిందని విమర్శలు చేశారు. అయితే ఈ సందర్భంగా లోకేష్ సభలోకి  సెల్ ఫోన్ తీసుకురావడంపై  వైసీపీ మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. లోకేష్ చేసిన ఆరోపణలు ఏమాత్రం వాస్తవం లేదని, ఉంటే సంబంధిత ఆధారాలను చూపించాలని, అలా చూపించని పక్షంలో క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు.


 ఇక శాసనమండలిలో రాష్ట్ర అభివృద్ధి, వికేంద్రీకరణ బిల్లుపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా టిడిపి శాసనమండలి సభ్యులు కాస్త గట్టిగా మాట్లాడినా లోకేష్ మాత్రం పెద్దగా వీటిపై మాట్లాడలేకపోయారు. ఆయన స్పీచ్ మొత్తం చాలా చప్పగా సాగింది. దీనిపై టిడిపి శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు తరువాత ఆ స్థానంలో కూర్చోవాల్సిన లోకేష్ తనకు అందివచ్చిన అవకాశాన్ని కూడా ఇలా వదిలేసి ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు వెనకాడడంపై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.  మొత్తంగా చూస్తే శాసనమండలిలో లోకేష్ ప్రసంగం పై సొంత పార్టీ నాయకులే పెదవి విరుస్తున్నారు. మా చినబాబు లో ఎప్పటికీ మార్పు రాదని, ఆయనను అందరూ ఊరికే విమర్శించడంలేదంటూ మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: