ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లనుంచి వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించడానికి కేంద్ర ప్ర‌భుత్వం పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం రూపొందించి అమ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, కేంద్రం నిర్ణ‌యంపై కొన్ని పార్టీలు, ప‌లు వ‌ర్గాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. వాటిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్నోలో మంగళవారం సీఏఏకు అనుకూలంగా జరిగిన ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ... `చట్టం ఎంత వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ, అది అమలు చేసి తీరుతాం.. నిరసన తెలియజేసేవారు కొనసాగించవచ్చు. ద‌మ్ముంటే నాతో స‌వాల్‌కు రండి` అని వ్యాఖ్యానించడం సంచ‌ల‌నంగా మారింది. దీనిపై ఎన్నికల వ్యూహకర్త, జేడీ(యూ) డిప్యూటీ చీఫ్ ప్రశాంత్ కిషోర్, ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

 


లక్నోలో మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ కిషోర్ కేంద్ర హోంమంత్రికి కౌంట‌ర్ ఇచ్చారు. సీఏఏ, ఎన్‌ఆర్సీకి వ్యతిరేకంగా నిరసన తెలిపేవారిని మీరు పట్టించుకోకపోతే.. ముందుకు వెళ్లి సీఏఏ, ఎన్‌ఆర్సీని ఎందుకు అమలు చేయడం లేదు? అని ప్రశ్నించారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ ముస్లింలపై వివక్ష చూపుతున్నాయని ఆరోపించారు. 'ప్రజల అసమ్మతిని తోసిపుచ్చడం ఏ ప్రభుత్వ బలానికి సంకేతం కాదు' అని వ్యాఖ్యానించారు.  

 

కాగా, సిటిజెన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ (సిఎఎ)పై తనతో చర్చించాలని ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సవాల్‌ విసిరారు. సిఎఎపై బహిరంగంగా చర్చించగలరా అంటూ అమిత్‌షా ప్రతిపక్ష నేతలైన మమతా బెనర్జీ, రాహుల్‌ గాంధీ, అఖిలేష్‌ యాదవ్‌లకు సవాల్‌ విసిరారు. దీనిపై ఒవైసీ స్పందిస్తూ ముస్లింల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారంటూ అమిత్‌షాపై నిప్పులు చెరిగారు. ”వారితో చర్చ ఎందుకు? నాతో చర్చించండి” అని ఒవైసీ అన్నారు. ”మీరు నాతో చర్చించడం. నేను ఇక్కడే ఉన్నారు. వారితో చర్చ ఎందుకు? గడ్డం కలిగిన వ్యక్తితో చర్చ జరగాలి. నేను వారితో సిఎఎ, ఎన్‌పిఆర్‌, ఎన్‌ఆర్‌సిలపై చర్చించగలను” అని ఒవైసీ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: