ఇన్ సైడర్ ట్రేడిండ్ లో భాగస్తులందరిపైనా  కఠిన చర్యలు తీసుకోవాలని ఏపి శాసనసభ తీర్మానించింది. తీర్మానంలో భాగంగానే  చంద్రబాబునాయుడుపై తొందరలోనే సిఐడి కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం.  ఇందుకు అవసరమైన రంగాన్ని ప్రభుత్వం ఇప్పటికే రెడీ చేసినట్లు సమాచారం.  ఇన్ సైడర్ ట్రేడింగ్ పై అసెంబ్లీలో వాడి వేడి చర్చలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. 

 

ఇందులో భాగంగానే ట్రేడింగ్ కు పాల్పడిన వారందిరిపైనా కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అంటూ మెజారిటి సభ్యులు స్పీకర్ ను కోరారు. స్పీకర్ కూడా అదే పద్దతిలో ఆదేశించారు. దానికి అనుగుణంగానే హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అసెంబ్లీలో  మాట్లాడుతూ  ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిన వారందరిపైనా కఠిన చర్యలు తీసుకునేందుకు అసెంబ్లీ ఆమోదం కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. దాంతో  చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్ఏలు, ఎంఎల్ఏలు, కొందరు కీలక వ్యక్తులపై కేసులు నమోదు చేయటమే మిగిలిందని అర్ధమైపోతోంది.

 

వైసిపి వర్గాల సమాచారం ప్రకారం చంద్రబాబుతో పాటు మొత్తం 40 మీద ఇన్ సైడర్ ట్రేడింగ్ కు సంబంధించిన కేసులు నమోదు చేయబోతున్నారు. ఈ 40 మందికి సంబంధించిన ట్రేడింగ్ ఆరోపణలపై 1800 డాక్యుమెంట్లను అన్నీ కోణాల్లోను అధికారులు  పరిశీలించారట. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే కేసులు పెట్టే విషయం స్పీడవుతుందని సమాచారం.

 

ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని అధికారపార్టీ కచ్చితంగా చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అలాంటిది ఏమీ లేదని  చంద్రబాబు, లోకేష్ ఇతర నేతలు కొట్టేస్తున్నారు. పైగా అలాంటిదేమైనా జరిగుంటే వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చాలాసార్లే చాలెంజ్ చేశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్  పై రాష్ట్ర పోలీసులతో నేరుగా దర్యాప్తు చేయిస్తే సమస్యలు వస్తాయని ప్రభుత్వం అనుమానిస్తోంది. అందకనే మొత్తం వ్యవహారాన్ని లోకాయుక్తకు అప్పగించి దాని ద్వారా కోర్టు కేసు నమోదు చేయించాలని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారట.

 

ఎవరిపేర్లతో అయితే భూములు రిజస్ట్రేషన్లు జరిగాయో వాళ్ళ ఆధార్ కార్డులను పట్టుకుంది  సిఐడి. ఆధార్ కార్డుల ద్వారా వాళ్ళ బ్యాంకు ఖాతాలు, ఆ ఖాతాల లావాదేవీలు తదితరాలన్నింటినీ సిఐడి ఇప్పటికే సేకరించినట్లు సమాచారం. ఈ ఆధారాల ద్వారానే భారీ ఎత్తున భూ కుంభకోణం జరిగిందని ప్రభుత్వం నిర్ధారణకొచ్చింది. ఏదేమైనా తొందరలోనే ఇన్ సైడర్ ట్రేడింగ్  ప్రకంపనలు మొదలవ్వటం ఖాయమనే అనిపిస్తోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: