శాస‌న‌మండ‌లిలో జ‌రిగిన ప‌రిణామాల‌పై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. - ఈ రోజు చాలా బాధాకరమైన రోజు అని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యయంలో బ్లాక్ డే కంటే కూడా ఘోరమైన రోజు అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చట్టసభలపై గౌరవం లేకుండా టీడీపీ వ్యవహరించిందని మండిప‌డ్డారు. ``మండలి ఛైర్మన్ ఎదురుగా గ్యాలరీలో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు కూర్చుని ప్రభావితం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బిల్లులను టీడీపీ అడ్డుకుంది.``అని ఆరోపించారు. 

 


 
13 జిల్లాల్లో సమగ్ర అభివృద్ధి జరగాలని సీఎం వైయస్ జగన్ ఆశించారని కానీ...టీడీపీ దానికి అడ్డుప‌డింద‌ని బుగ్గ‌న వ్యాఖ్యానించారు. ``మండలిలో మొదటి నుంచీ నిబంధనలను ఉల్లంఘించారు.- అందరికీ నీతి నియమాలు చెప్పే యనమల రామ‌కృష్ణుడు అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై నిబంధనలను పాటించలేదు. ఛైర్మన్ పై టీడీపీ సభ్యులు ఒత్తిడి తీసుకొచ్చారు. ఉద్దేశపూర్వకంగా, నిబంధనలకు వ్యతిరేకంగా సెలెక్ట్ కమిటీ పంపారు. `` అని మండిప‌డ్డారు. 

 

 సెలెక్ట్ కమిటీకి పంపాలంటే ముందుగానే మోషన్ మూవ్ చేయాలని బుగ్గ‌న స్ప‌ష్టం చేశారు. `` ఈరోజు సాయంత్రం ఛైర్మన్‌కు పంపిన లెటర్‌ను నిన్ననే పంపినట్లుగా చెప్పారు. చంద్రబాబు కనుసన్నల్లో చైర్మన్ వ్యవహరించారు.  చంద్రబాబు నేరుగా చైర్మన్ ను ప్రభావితం చేశారు. ఛైర్మన్ తను చేసేది తప్పు అని చెప్పారు.  తన విచక్షణాధికారంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వికేంద్రీకరణ, సములిత అభివృద్ధి కోసం తెచ్చిన బిల్లును టీడీపీ అడ్డుకుంది. 100 సంవత్సరాల పాలన చరిత్ర చూసి రెండు బిల్లులను ప్రభుత్వం తీసుకొచ్చింది. శాసనసభ ఆమోదించినా మండలి వ్యతిరేకించడం రాజ్యాంగ విరుద్ధం.`` అని అన్నారు.

 

 


బీఏసీలో యనమల మాట్లాడిన దానికి చేసిన దానికి పొంతన లేదని బుగ్గ‌న తెలిపారు. ``రూల్ 71 అడ్డంపెట్టుకొని సభను పక్కదారి పట్టించారు. రూల్ 71 అనేది ఎందుకు ఉందో  టీడీపీ సభ్యులకు తెలుసా?  రెండు రోజులుగా బిల్లును ఓటింగ్ కు పెట్టకుండా కావాలని అడ్డుకున్నారు.గ్యాలరీ కూర్చున్న చంద్రబాబు మాటలు విని మండలి ఛైర్మన్ నడుచుకుంటారా? చైర్మన్ గా తప్పులు చేసి విచక్షణాధికారాలను ఉపయోగించానని ఎలా చెప్తారు?`` అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. సభను చైర్మన్ రాజకీయాల కోసం వినియోగించారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 13 జిల్లాల అభివృద్ధి కోసం శాసనసభలో ఆమోదించిన బిల్లులను  మండలి చైర్మన్ ఎలా వ్యతిరేకిస్తారు అని ప్ర‌శ్నించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: