క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది.  జగన్ దెబ్బను తట్టుకోలేక ఒకవైపు చంద్రబాబునాయుడు రోడ్ల మీదకొచ్చి జోలె పట్టుకుని తిరుగుతున్న విషయం చూస్తున్నదే. అదే పద్దతిలో  పవన్ కల్యాణ్ కూడా హైదరాబాద్-అమరావతి మధ్య తిరుగుతున్నారు. 

 

ఇంతకీ విషయం ఏమిటంటే బిజెపితో పొత్తు పెట్టుకున్న పవన్ జనసేన పార్టీ నిర్వహణ భారాన్ని చాలా వరకూ దించేసుకున్నారు. అంటే ఇక నుండి రెండు పార్టీల బాధ్యతను బిజెపి నేతలే చూసుకుంటారన్నది అర్ధమైపోతోంది. అందుకే ఎంచక్కా సినిమా షూటింగులపై పవన్ దృష్టి పెట్టారు.

 

సోమవారం ఉదయం లాయర్ సాబ్ అనే సినిమా షూటింగ్ లో కూడా పాల్గొన్నారు. పింక్ అనే హింది సినిమాకు  రీమేక్ లేండి ఈ  లాయర్ సాబ్. సోమవారం షూటింగ్ లో ఉండగానే అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందిన విషయం తెలుసుకున్నారు. వెంటనే షూటింగ్ ముగించుకుని మధ్యాహ్నం తర్వాత హడావుడిగా అమరావతికి బయలుదేరారు.

 

సాయంత్రానికి మంగళగిరి చేరుకుని పార్టీ నేతలు, కార్యకర్తలతో  సమావేశం అయ్యారు. తర్వాత స్ధానికులతో కూడా మీటింగ్ పెట్టుకున్నారు. మళ్ళీ అర్ధరాత్రి బయలుదేరి మంగళవారం తెల్లవారు జాముకు హైదరాబాద్ చేరుకున్నారు. ఉదయం మళ్ళీ షూటింగ్ లో పాల్గొన్నారట.  ఉదయం నుండి మధ్యాహ్నం వరకూ షూటింగ్ మళ్ళీ సాయంత్రానికి అమరావతికి చేరుకోవటం మళ్ళీ అర్ధరాత్రికి బయలుదేరి  ఉదయానికి హైదరాబాద్ కు చేరుకుని మళ్ళీ షూటింగ్ లో పాల్గొనటం అంటే కష్టమనే చెప్పాలి.

 

అసలు హైదరాబాద్-అమరావతి మధ్య రోజుకు రెండుసార్లు తిరగటం పవన్ కు అవసరమా అన్నదే అర్ధం కావటం లేదు. ఎలాగూ పార్టీ భారాన్ని బిజెపిపై పెట్టేశారు. చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడితే  బిజెపి వాయించేస్తుంది. కాబట్టి అమరావతి ప్రాంతంలో పవన్ పర్యటించినా ఒరిగేది కూడా లేదు. మరి ఎందుకు ఇంతగా రిస్క్ తీసుకుంటున్నారు ? ఎందుకంటే పవన్ పై జగన్మోహన్ రెడ్డి దెబ్బ అంత గట్టిగా పడింది. ఇంకొద్ది రోజులు ఇలాగే తిరిగితే  చివరకు ఇటు రాజకీయాలకు అటు సినిమాలకు కూడా పనికి రాకుండా పోతాడేమో అనే అనిపిస్తోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: