వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించనున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా,  ఏటా బడ్జెట్‌ పత్రాల ముద్రణ ప్రారంభానికి సూచికగా ఈ హల్వా వేడుకను నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో హల్వా వేడుక ఘనంగా జరిగింది. సోమవారం నార్త్‌ బ్లాక్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఆర్థిక కార్యదర్శులు, సీనియర్‌ అధికారులు ఇందులో పాల్గొన్నారు. కాగా, బ‌డ్జెట్‌కు సంబంధించి సామాన్యుల‌కు సైతం తీపిక‌బురు ద‌క్కింది. అయిదు ల‌క్ష‌ల ఆదాయం వ‌ర‌కు ప‌న్ను ఉండ‌ద‌ని తెలుస్తోంది.

 

స‌హ‌జంగానే బ‌డ్జెట్ స‌మ‌యం కావ‌డంతో...ఈసారి ఆదాయం ప‌న్నుపై  ఎటువంటి మిన‌హాయింపు ఉంటుంద‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. కాగా, అధికార వ‌ర్గాలు బ‌హిరంగంగా వెల్ల‌డించ‌న‌ప్ప‌టికీ... 2020 బ‌డ్జెట్‌లో ఐటీ శ్లాబ్‌లో వెస‌లుబాటు ఉండే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  అయిదు ల‌క్ష‌ల ఆదాయం వ‌ర‌కు ప‌న్ను ఉండ‌దేమో అన్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.  5 ల‌క్ష‌ల నుంచి 10 ల‌క్ష‌ల ఆదాయం వ‌ర‌కు ప‌ది శాతం ప‌న్ను వ‌సూల్ చేయ‌నున్నారు.  10 నుంచి 20 ల‌క్ష‌ల ఆదాయం వ‌ర‌కు 20 శాతం ప‌న్ను వ‌సూల్ చేయ‌నున్నారని స‌మాచారం. 

 

కాగా , బడ్జెట్‌ వివరాల గోపత్య కోసం ఎవరూ ఫిబ్రవరి 1దాకా ఆర్థిక మంత్రిత్వ శాఖను వీడరు. ‘బడ్జెట్‌ రహస్యాలను కాపాడటం కోసం బడ్జెట్‌ తయారీలో పాల్గొన్న వారందరినీ నార్త్‌ బ్లాక్‌లోనే ఉంచుతాం. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ ప్రకటన వరకు ఇంటికి వెళ్లరు. ఫోన్‌ కాల్స్‌, ఈ-మెయిల్స్‌ ఇతరత్రా అన్ని రకాల సమాచార వ్యవస్థలకూ వీరు దూరంగా ఉంటారు.’ అని ఓ ప్రకటనలో ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అయితే అతికొద్ది మంది సీనియర్‌ అధికారులకే ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. బడ్జెట్‌ ముద్రణాలయం కూడా నార్త్‌ బ్లాక్‌లోనే ఉన్నది. 

మరింత సమాచారం తెలుసుకోండి: