తెలుగుదేశం పార్టీ వ్యూహం ఫలించింది . పరిపాలన వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటీ కి వెళ్లకుండా వైకాపా సర్కార్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు . పరిపాలన వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీ కి పంపాలని శాసన మండలి నిర్ణయించింది . దీనితో మూడు నెలలపాటు ఈ బిల్లు ఆమోదం కోసం ప్రభుత్వం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది . ఆఘమేఘాల మీద విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేయడం తోపాటు , అమరావతి లో  శాసన రాజధానిని , కర్నూల్ లో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని భావిస్తోన్న జగన్ సర్కార్ మండలి నిర్ణయం శరాఘాతమనే చెప్పాలి .

 

పరిపాలన వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర మంత్రులు , వైకాపా శాసనసభ్యులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు . మండలి ప్రాంగణంలోనే తిష్ట వేసిన మంత్రులు , టీడీపీ మండలి సభ్యులను తమవైపు లాక్కునేందుకు తీవ్ర ప్రయత్నాలే చేసినట్టు తెలుస్తోంది . ఇప్పటికే రూల్ 71  పై ఓటింగ్ సందర్బంగా ఇద్దరు టీడీపీ సభ్యులను తమవైపు తిప్పుకోవడం లో సక్సెస్ అయిన రాష్ట్ర మంత్రులు , ఈ రోజు మరికొందరిపై దృష్టి సారించారని సమాచారం . అయితే మండలి గ్యాలరీ లో  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూర్చుని , పార్టీ సభ్యులు చేజారిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు . పరిపాలన వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపడం పట్ల ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు . ఏపీ చట్టసభలో ఇది బ్లాక్ డే గా పేర్కొన్నారు .

 

రూల్ 71 ని అడ్డం పెట్టుకుని టీడీపీ డ్రామాలు ఆడిందని విరుచుకుపడ్డారు . ఇక బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపే విచక్షణ అధికారం మండలి చైర్మన్ కు ఉందని టీడీపీ నాయకుడు , మండలి విపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు . సెలెక్ట్ కమిటీకి పంపితే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: