నూతన పురపాలికల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగం కోసం పోటీ పడ్డారు . రాష్ట్రంలోని పలు పట్టణాలను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే . రాష్ట్ర వ్యాప్తంగా 120  మున్సిపాలిటీలకు బుధవారం ఉదయం ఏడు నుంచి ఐదు గంటల వరకు పోలింగ్ జరిగింది . ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని పలు తృతీయ శ్రేణి పట్టణాలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయడం తో పాలకవర్గం ఏర్పాటు కోసం నిర్వహించిన ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు .

 

సహజంగానే రాజకీయ చైతన్యం కలిగిన నల్గొండ జిల్లాలో , పట్టణ ప్రాంత ఓటర్లు కూడా తమ రాజకీయ  చైతన్యాన్ని  ప్రదర్శించారు . జిల్లాలోని దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదు కావడం  పరిశీలిస్తే,  జిల్లాలోని పట్టణ ప్రాంత ఓటర్లు ఎంత ఉత్సాహంగా  పోలింగ్ పాల్గొన్నారో ఇట్టే అర్ధమవుతుంది . నూతనంగా ఏర్పడిన  చౌటుప్పల్  మున్సిపాలిటీలో ఏకంగా దాదాపు 94  శాతం ఓటింగ్ నమోదు కాగా , చిట్యాలలో 80 శాతానికిపైగా ఓటింగ్ నమోదయినట్లు అధికారులు వెల్లడించారు . దేవరకొండ, చండూరు , కోదాడ , నేరేడుచర్ల , హుజూర్ నగర్ వంటి నూతన మున్సిపాలిటీల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరడం  ,  పెరిగిన ఓటింగ్ శాతాన్ని చూసి రాజకీయ పార్టీల అభ్యర్థులు గెలుపు పై ఎవరికివారు లెక్కలు కట్టుకుంటున్నారు .

 

 రాజకీయ పార్టీల అభ్యర్థులుగానే  , ఎన్నికల్లో  వ్యక్తిగతంగా  తమ ఇమేజ్ కూడా పని  చేసే అవకాశాలు లేకపోలేదని భావిస్తోన్న ప్రధాన పార్టీల  అభ్యర్థులు తమకు ఎక్కడ ప్లస్ అవుతుందో అంచనాలు వేసుకుంటున్నారు . జిల్లాలో  మెజార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని అధికార పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుండగా ,  తామేమి తక్కువ తినలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: