తాను ఏమీ చేయకపోయినా... ఏదో చేసినట్టుగా గొప్ప చెప్పుకోవడం, అడ్డగోలు వ్యవహారాల్లోనూ తనదే పైచేయి అన్నట్టుగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు  ప్రవర్తన ఉంటుంది. నిన్న శాసనమండలిలో టిడిపి ఆడిన మైండ్ గేమ్ లో తాత్కాలికంగా ఆ పార్టీ విజయం సాధించినా తాత్కాలికంగా ఈ విషయంలో వైసిపి వెనుకబడినా జనాలు మాత్రం టిడిపి వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. శాసనసభలో అమరావతి నుంచి రాజధాని తరలించ వద్దు అంటూ జగన్ కు దండం పెట్టి మరి వేడుకున్నారు టిడిపి సభ్యులు.


మూడు రాజధానుల విషయంలో ఎన్ని వ్యూహాలు రచించినా వైసీపీ మాత్రం శాసనమండలిలో విజయం సాధించలేకపోయింది. 150 మంది శాసన సభ్యులు ఉండడంతో వైసిపి రెండు బిల్లులను శాసనసభలో సులువుగా ఆమోదించింది. ఇక శాసనమండలి విషయానికి వచ్చేసరికి వైసీపీకి బలం లేకపోవడం, టిడిపి బలంగా ఉండడంతో వైసీపీ ఎత్తుగడలు పని చేయలేదు. అందుకే ముందుగా శాసన మండలిని రద్దు చేస్తున్నట్లు వైసిపి ప్రచారం చేసింది. టిడిపి నుంచి ఎమ్మెల్సీలను దూరం చేసేందుకు కూడా ప్రయత్నించింది. డొక్కా మాణిక్య వరప్రసాద్, పోతుల సునీత, శివ రెడ్డి వంటివారు వైసిపి ఆడిన మైండ్ గేమ్ లో చిక్కుకున్నారు. వీరంతా సమావేశాలకు దూరం కావడంతో టిడిపిలో ముందుగా ఆందోళన చెలరేగింది. అయితే ఈ విషయంపై నిన్న అర్ధరాత్రి వరకు పార్టీ సీనియర్ నాయకులతో సమావేశం నిర్వహించి దీనిపై ఒక వ్యూహాన్ని టీడీపీ సిద్ధం చేసుకుంది.


 ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానుల నిర్ణయాన్ని వాయిదా వేయించాలని ఈ సందర్భంగా నిర్ణయించుకున్నారు. దాని ప్రకారమే శాసనమండలిలో దాదాపు మూడు గంటల పాటు శాసన మండలి గ్యాలరీలో చంద్రబాబు కూర్చున్నారు. మండలి చైర్మన్ వెనకడుగు వేయకుండా గ్యాలరీలోని చంద్రబాబు ఆయనకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. బాబు వ్యూహం ప్రకారం నియమాలకు విరుద్ధంగా శాసనమండలి చైర్మన్ వ్యవహరించి రెండు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించడంతో మూడు నెలల పాటు రాజధాని తరలింపు వాయిదా పడే అవకాశం ఏర్పడింది. 


అయితే సభ్యుల నుంచి ఎటువంటి ప్రతిపాదన రాకుండానే శాసనమండలి చైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపించడం పై రాజకీయాల మీద కాస్తో కూస్తో అవగాహన ఉన్నవారు సైతం మండలి చైర్మన్ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఇలా అడ్డగోలుగా వ్యవహరించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. పైగా టిడిపి అధినేత చంద్రబాబు రాజకీయంగా  అడ్డగోలుగా ఎదిగారని, ఇప్పుడు ఇటువంటి వ్యవహారాలు చేయడం ఆయనకు కొత్తేమీ కాదని పలువురు శాసనమండలిలో నిన్న జరిగిన వ్యవహారాలను గుర్తు చేస్తూ బాబు తీరుని తప్పుబడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: