నగరంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మున్సిపల్ ఎలక్షన్స్ సజావుగా సాగాయి. ఏవో చిన్న చిన్న సమస్యలు తప్పా పోలింగ్ సమయాల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు తలెత్తలేదు.. ఇకపోతే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 71.41 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించగా, అందులో 74.73% పోలింగ్ 120 మున్సిపాలిటీల్లో నమోదు కాగా.. 58.86 శాతం పోలింగ్ 9 నగర పాలక సంస్థల్లో నమోదైనట్లు తెలిపారు. అంతే కాకుండా పలు ప్రాంతాల్లో 90 శాతానికి పైగా పోలింగ్ నమోదవడం విశేషం.

 

 

అయితే ఈ మున్సిపల్ ఎన్నికలను కామారెడ్డిలోని 41వ వార్డులో మళ్లీ నిర్వహించవలసిన పరిస్దితి తలెత్తింది. దీనికంతటికి కారణం ఒక ఓటరు వేసిన టెండర్ ఓటు వల్ల. ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక్క టెండర్ ఓటు పడినా రీపోలింగ్ జరుగుతుందని  స్పష్టం చేసిన నేపథ్యంలో ఇక్కడ రీపోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఇక రీపోలింగ్ జరగడానికి దారి తీసే పరిస్దితులు ఏమంటే ఓ వ్యక్తి తన ఓటును మరెవరైనా వేసినట్లు గుర్తిస్తే.. అలాంటి ఓటరుకు టెండర్ ఓటు వేసే అవకాశం ఉంటుంది. దాన్ని సవాల్ చేస్తూ టెండర్ ఓటు వేయవచ్చు. ఇకపోతే దొంగ ఓట్ల పాలిట బ్రహ్మాస్త్రంగా దీన్ని ఉపయోగించుకోవచ్చన్నమాట..

 

 

ఇదిలా ఉండగా కామారెడ్డి టెండర్ ఓటు అంశంలో నివేదిక అందిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుంది. తిరిగి ఎన్నిక నిర్వహించాల్సి వస్తే.. శుక్రవారం జనవరి 24.  కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు కామారెడ్డిలోని వార్డుకు రీపోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఈ టెండర్ ఓట్లు ఇంకెక్కడైనా నమోదయ్యాయా అనే విషయంపై గురువారం ఉదయం లోగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది...

 

 

కాబట్టి ఒక వేళ మరెక్కడైనా ఇలాంటి పరిస్దితి ఎదురైతే, అక్కడ కూడా ఈ విధానాన్నే కొనసాగించే వీలు ఉంది.. ఇక ఈ టెండర్ ఓటు అస్త్రాన్ని ఇదివరకు రాష్ట్రంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నలుగురు ఓటర్లు వినియోగించుకోగా, ఆయా స్థానాల్లో అధికారులు రీపోలింగ్ నిర్వహించడమే కాకుండా, ఆ నలుగురు ఓటర్లకు గవర్నర్ చేతుల మీదుగా రాష్ట్ర ఎన్నికల సంఘం సన్మానం కూడా చేయించింది. ఈ సందర్భంగా వారికి ప్రజాస్వామ్య పరిరక్షణ పురస్కారాలు కూడా అందించారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: