మూడు రాజధానుల ఏర్పాటు, సిఆర్డీఏ రద్దుపై తెలుగుదేశంపార్టీ  సీనియర్, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు పెద్ద షాక్ తగిలింది. ఏమాత్రం ఊహించని రీతిలో రాజుగారికి  కుటుంబం నుండే పెద్ద షాక్ తగిలింది.  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న  మూడు రాజధానులు, సిఆర్డీఏ రద్దు బిల్లులకు అశోక్ సోదరుడు ఆనంద గజపతిరాజు కూతురు సంచిత గజపతిరాజు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

 

ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి జరగాలంటే జగన్ ప్రతిపాదించిన పద్దతిలోనే జరుగుతుందని బల్లగుద్ది మరీ చెప్పారు.  కర్నూలులో హై కోర్టు ఏర్పాటు, విశాఖపట్నంలో  ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటుకు  బిజెపి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఢిల్లీలో ప్రకటించారు. సంచిత గజపతిరాజు బిజెవైఎంలో కీలక నేతగా పనిచేస్తున్నారు.

 

జగన్ ప్రతిపాదనలకు బిజెవైఎం పూర్తిగా మద్దతు పలుకుతున్నట్లు ప్రకటించటం ముందుగా గజపతిరాజు కుంటుంబంలో తర్వాత విజయనగరం జిల్లా టిడిపిలో సంచలనంగా మారింది.  పైగా చంద్రబాబునాయుడును ఉతికి ఆరేశారు. అమరావతిలో రాజధాని అంటూ చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్ పై మండిపడ్డారు.  రాజధాని పేరుతో చంద్రబాబు రైతుల నుండి సేకరించిన వేలాది ఎకరాలను వెంటనే వాళ్ళకు తిరిగిచ్చేయాలంటూ డిమాండ్ చేశారు.

 

విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధానికి అడ్డం పడుతున్న చంద్రబాబు అసలు పదేళ్ళ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను ఎందుకు వదిలి విజయవాడకు పారిపోయారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.  ప్రధానమంత్రి నరేంద్రమోడి చెబుతున్న మినిమం గవర్నమెంట్ మ్యాగ్జిమమ్ గవర్నెన్స్ ను ఎవరూ అనుసరిస్తున్నా కేంద్రప్రభుత్వం పూర్తిగా మద్దతిస్తుందని సంచిక చెప్పటం అశొక్ కు మింగుడుపడటం లేదు.

 

రైతుల నుండి వేలాది ఎకరాల వ్యవసాయ భూములు సేకరించి అమరావతిని నిర్మిస్తానని చంద్రబాబు చెప్పటమే అనాలోచిత చర్యగా మండిపడ్డారు. సంచిత తాజా వ్యాఖ్యలతో విజయనగరం రాజుల కుటుంబంలో కలకలం మొదలైంది. ఒకవైపు జగన్ ప్రతిపాదనపై  అశోక్ వ్యతిరేకంగా సంతకాల సేకరణ బిజీలో ఉండగా అదే సమయంలో సంచిత చేసిన వ్యాఖ్యలు షాక్ కొట్టినట్లైంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: