ఏపి రాజకీయాలు ఇప్పుడు ఇండియా పాకిస్దాన్ మ్యాచ్‌లా ఉత్కంఠంగా సాగుతున్నాయి. ఇందులో ఒక జట్టు టీం లీడర్ జగన్ కాగా, మరో జట్టుకు చంద్రబాబు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో చంద్రబాబు అండ్ బ్యాచ్ గెలవాలని గత కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నారు. కానీ సరైన అవకాశం దొరకడం లేదని బాధపడుతూ నలుగురిలో నవ్వుల పాలవుతున్న సమయంలో జరిగిన విషయం ఏంటంటే ఆకలితో నకనకలాడే నక్కకు బొక్క దొరికినట్లుగా టీడీపీ పార్టీ నడుపుతున్న బాబోరికి అధికార పక్షం పైన ఆవగింజంత విజయం దక్కగా, దాన్ని భూతద్దంలో పెట్టి పెద్దగా చూస్తూ ఎక్కడలేని సంబరాలు చేసుకుంటున్నారు.

 

 

ఏదైన బరిలోకి దిగినాక ఆ ఆట పూర్తిగా ఆడితేనే కదా దాని ఫలితం తేలేది. ఇంకా అధికార పార్టీకి నాలుగు సంవత్సరాల అవకాశం ఉండగా, చిన్న పాటి గోరుముద్దలకే బాబుగారు చేసే హంగామా, ఆక్సిజన్ అందక అల్లాడుతున్న టీడీపీ పార్టీలోని నాయకులను బలవంతంగా బ్రతికించుకున్నట్లుగా అవుతుందని అనుకుంటున్నారట ఏపీ ప్రజలు. ఇక వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ శాసన మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకోవడంతో టీడీపీ సంబరాల్లో మునిగిపోయింది. ఇకపోతే బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపి, సభను నిరవధికంగా వాయిదా వేసిన అనంతరం మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ లోకేశ్ మరింత ఉత్సాహం ప్రదర్శించారు.

 

 

సభ నుంచి బయటకు వస్తూ ‘జై అమరావతి, జై చంద్రబాబు’ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు నాయకత్వానికి జేజేలు కొడుతూ బయటకు వచ్చారు. మొత్తానికి శాసన మండలి వ్యవహారం టీడీపీలో కొత్త జోష్ తీసుకొచ్చిందని కొందరు టీడీపీ శ్రేణులు సంబరపడుతున్నారు..  అయితే ఈ చిన్నపాటి గెలుపును టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవటం వరకు బాగానే ఉంటుంది. కానీ దీని వెనక ఉన్న వాస్తవాన్ని వారు గుర్తించడం లేదు.. అమరావతి పరిధిలో ఉన్న ఐదారు గ్రామాల ప్రజల్లో టీడీపీకి కాస్త మైలేజ్ పెరిగితే అదే టైంలో అటు రాయలసీమ, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల ప్రజల్లో వైసీపీపై ఎక్కడలేని క్రేజ్ పెరిగిందన్న ఈ విషయాన్ని గుర్తించడం లేదు.. అదే టైంలో వైసీపీ ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నించని చంద్రబాబు కేవలం రాజధాని కోసమే కాలక్షేపం చేయటం వల్ల కూడా పరోక్షంగా వైసీపీకి మేలు జరుగుతోంది.. అందుకే పైకి గెలిచింది టీడీపీ అన్నట్టుగా ఉన్న లోపల పరిణామాలు చూస్తే ఒక రకంగా వైసీపీ తిరుగులేని విజయం సాధించినట్లే అవుతుంది... 

మరింత సమాచారం తెలుసుకోండి: