రెండు బిల్లుల విషయంలో  శాసనమండలిలో బుధవారం జరిగిన కంపు మొత్తానికి వైసిపి వైఫల్యమే స్పష్టంగా కనిపిస్తోంది.  ఎప్పుడు కూడా ఏ విషయంలో అయినా అధికారపార్టీ సక్సెస్ కావాలంటే అందుకు రెండు మార్గాలుంటాయి. మొదటిది ప్రభుత్వ పరంగా ఉండే యంత్రాంగం. రెండోది పార్టీ పరంగా పనిచేయాల్సిన  యంత్రాంగం. బుధవారం బిల్లుల విషయంలో ఓటింగ్ జరగకుండా ఏకంగా  సెలక్ట్ కమిటికి పంపేస్తున్నట్లు మండలి ఛైర్మన్ షరీఫ్ ప్రకటించటం సంచలనంగా మారింది.

 

అసెంబ్లీలో వైసిపికి అఖండ మెజారిటి ఉన్నా మండలిలో మాత్రం టిడిపిదే మెజారిటి అని అందరికీ తెలిసిందే. కాబట్టి అసెంబ్లీ పాసయ్యే ప్రతి బిల్లు మండలిలో కూడా పాసవ్వాలంటే టిడిపి సహకారం అవసరం. టిడిపి గనుక కాదంటే ఓటమే తప్ప మరో మార్గం లేదు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డితో పాటు మంత్రులు, ఎంఎల్ఏలకు  నేతలకు కూడా బాగా తెలుసు. ఇంత తెలిసిన తర్వాత బిల్లులపై చర్చ జరిగేట్లు, ఓటింగ్ జరిగేట్లుగా చూసుకోవటంలో వైసిపి ఫెయిలైనట్లు స్పష్టంగా అర్ధమవుతోంది.

 

ఉదయం నుండి కూడా బిల్లులపై చర్చ జరగనీయకుండా ఓటింగ్ జరగకుండా సెలక్ట్ కమిటికి పంపేట్లుగా టిడిపి ప్రయత్నిస్తోందంటూ మీడియాలో వస్తునే ఉంది. అయినా వైసిపి ముఖ్యులు మేల్చొన్నట్లు లేదు. సెలక్ట్ కమిటికి పంపేస్తే ఆకాశం బద్దలైనట్లు కాదు. కాకపోతే జగన్ అనుకున్న పని జరగటానికి మరో మూడు లేకపోతే నాలుగు మాసాలు జాప్యం జరుగుతుందంతే.

 

అయితే టిడిపి ఎంఎల్సీలను మ్యానేజ్ చేయటంలో వైసిపి విఫలమైంది. అదే సందర్భంలో చంద్రబాబంటే మండిపోయే బిజెపి సీనియర్ సభ్యుడు సోము వీర్రాజు లాంటి వాళ్ళ సహకారం కూడా  తీసుకున్నట్లు లేదు. రాజ్యసభలో తమకు బలం లేదని తెలిసి కూడా బిజెపి నేతలు ప్రతిపక్షాలతో  ఎంత విస్తృతస్ధాయిలో చర్చలు జరుపుతున్నది అందరూ చూస్తున్నదే. మరి అదే పద్దతిలో ఇక్కడ కూడా జగన్ ఎందుకు ప్రయత్నించలేదు ?  ఆ ప్రయత్నాలు జరిగినట్లు ఎక్కడా కనబడలేదు కాబట్టే వైసిపి ఫెయిలైందని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: