కొన్ని సంఘ‌ట‌న‌లు అస్స‌లు ఊహించ‌లేం. ఇలా జ‌ర‌గుతుందా? అని అనుకునే లోగా...జ‌రిగిపోతుంది. రాజ‌కీయాల్లో అయితే, ఇలాంటి చిత్రాలు ఎన్నో ఉంటాయి. ఫ‌లానా పార్టీలోనే ఉంటార‌నుకునే నాయ‌కులు....తేలిక‌గా ప్లేటు ఫిరాయించేస్తుంటారు. ఎంతో క్ర‌మ‌శిక్ష‌ణ గ‌ల‌వారు అనుకునే నేత‌లు...నాయ‌కుల‌పై దుమ్మెత్తిపోస్తుంటారు. మ‌రికొంద‌రు నేత‌లు కామెడీ కామెంట్లు చేస్తుంటారు. తాజాగా ఏపీలోని ప‌రిణామాల‌పై ఓ టీడీపీ నేత స్పందిస్తూ...ఇదే త‌ర‌హా కామెడీ చేశారంటున్నారు నెటిజ‌న్లు. తెలుగుదేశం పార్టీ నేత‌, ఏపీ బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ మాజీ చైర్మ‌న్ వేమూరి ఆనంద సూర్య తాజా వ్యాఖ్య‌లు ఇదే చ‌ర్చ‌కు దారితీశాయి.

 

తెలుగుదేశం పార్టీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వేమూరి ఆనంద సూర్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సగం మంది వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుతో టచ్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ తీరుతో వైసీపీ ఎమ్మెల్యేలు సైతం విసిగిపోయారని, త్వరలో అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరతారని కూడా ఆయ‌న జోస్యం చెప్పారు. రాబోయే కాలం ముఖ్యమంత్రి జగన్ కు  అగ్ని పరీక్ష అని వ్యాఖ్యానించారు. అమరావతిపై ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా సీఎం ముందుకెళ్తున్నారని ఆరోపించారు. అమరావతిని కాపాడటానికి  జనసేన-బీజేపీలు పోరాటానికి సిద్ధమవటం సంతోషకరమ‌ని టీడీపీ నేత పేర్కొన్నారు. జనసేన-బీజేపీలు కూడా అమరావతిని కాపాడుకోవటానికి జేఏసీలో చేరాలని సూచించారు. ప్రధాని మోదీ శంకుస్థాపన‌ చేసిన చోట ఆయుత చంఢీయాగం నిర్వహిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

 

మండలి ఛైర్మన్ షరీఫ్‌పై  ఏపీ మంత్రులు బొత్స, కొడాలి నాని, అనిల్, వెల్లంపల్లి ప్రవర్తన బాధాకరమ‌ని టీడీపీ నేత వేమూరి ఆనంద సూర్య వాపోయారు.  మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, అనిల్, కొడాలి నాని, వెల్లంపల్లిని బ‌ర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ గవర్నర్ కలుగజేసుకుని మంత్రులపై చర్యలు తీసుకోవాలని  ఆనంద సూర్య కోరారు. కాగా, ఓ వైపు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియ‌ర్ నేత‌లు పార్టీకి గుడ్‌బై చెప్పేసి వైసీపీ బాట ప‌డుతుంటే...మ‌రోవైపు వైసీపీ నేత‌లు త‌మ పార్టీలో చేరనున్నార‌ని చెప్పుకోవ‌డం...టీడీపీ నేత‌ల ప్ర‌చారం తీరుకు నిద‌ర్శ‌న‌మ‌ని ప‌లువురు సెటైర్లు వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: