క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ మ‌రో ఊహించ‌ని ప‌రిణామంతో వార్త‌ల్లో నిలిచారు. మున్సిపల్ ఎన్నికల్లో బుధవారం వరకు బిజీగా గడిపిన ఎంపీ బండి సంజయ్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోవ‌డం, ఫోన్లు కూడా స్విచ్ఛాప్‌లో ఉండ‌టం స‌న్నిహితుల‌కు సైతం స‌మాచారం లేక‌పోవ‌డంతో...ఆయ‌న గురించి టెన్ష‌న్ నెల‌కొంది. కాగా క‌రీంన‌గ‌ర్ సీపీ క‌మ‌లాస‌న్ రెడ్డిపై ప‌లు కామెంట్లు చేసిన అనంత‌రం ఈ ప‌రిణామం జ‌ర‌గ‌డం చ‌ర్చ‌కు కార‌ణంగా మారింది. 

 

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ బండి సంజయ్ కుమార్ పై కిసాన్ నగర్ లో రాళ్ల దాడి జరిగిందని, పలువురు కానిస్టేబుళ్లకు మరియు వారి కార్యకర్తకు దెబ్బలు తగిలాయని, కరీంనగర్ లో అంతా టెన్షన్ నెలకొని ఉందని దూలం కళ్యాణ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. అయితే, క‌రీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై రాళ్ల దాడి జరిగిందంటూ మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి అన్నారు. అవన్నీ నిరాధార వార్తలని కమిషనర్ వివరణ ఇచ్చారు. 

 


అయితే, బీజేపీ నేతలు ఈ ప‌రిణామాల‌పై స్పందిస్తూ కొందరు దుండగులు ఎంపీ బండి సంజయ్‌పై రాళ్ల దాడి చేశారని, ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయనే ఉద్దేశంతో ఆయన ఆ సంఘటనను బహిర్గతపరచలేదని  తెలిపారు. నిఘా వర్గాల నివేదికలతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం గత రెండు రోజులుగా ఎంపీ బండి సంజయ్‌కి అదనపు భద్రత ఏర్పాటు చేశారని, కానీ ఈ సంఘటన నుంచి దృష్టి మళ్ళించేందుకు పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి రాళ్ల దాడి జరగలేదంటూ రాజకీయ నాయకుడిలా పత్రికా ప్రకటన జారీ చేశారని విమర్శించారు. కాగా, సీపీ కామెంట్ల‌పై ఎంపీ సంజ‌య్ స్పందిస్తూ, త‌న‌పై రాళ్లదాడి జరగలేదని కరీంనగర్ సీపీ ప్రకటించడంతో భద్రత ఉపసంహరించుకున్నారు. ఎలాంటి దాడి జరగక పోతే...  2 రోజుల క్రితం భద్రత పెంపు, బాంబు స్క్వాడ్ కేటాయింపునకు కారణం ఏమిటో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. అయితే, ఈ ప్ర‌క‌ట‌న చేసి త‌న వ్య‌క్తిగ‌త సిబ్బందిని వెన‌క్కు పంపిన అనంత‌రం సంజ‌య్ అజ్ఞాతంలోకి వెళ్ల‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: