క్రికెట్ ఇష్టపడే వారు ఇండియన్ మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ తెలియని వారు ఉండరు. అలాగే ఆయన ఆట తెలియని వారు ఉండరు. ముఖ్యంగా టెస్ట్‌ మ్యాచ్‌ల్లో ఆయన చాలా అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. జట్టు కష్టకాలంలో ఉంటే సుదీర్ఘ సమయం క్రీజులో నిలబడి చాలా కూల్‌గా పరుగులు రాబట్టేవారు. ఒకానొక సమయంలో పరుగులు రాబట్టలేకపోయిన వికెట్లు పడకుండా జట్టుకు రక్షణ గోడగా నిలబడేవారు. పైగా ప్రత్యర్ధులు ఎంత రెచ్చగొట్టిన కూడా ఏ మాత్రం బెదరకుండా తన ఆటతో స్ట్రాంగ్ రిప్లై ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ద్రావిడ్ గురించి ఇంత ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే...ఆయన యొక్క స్వభావం ఏంటి అనేది అర్ధం కావడానికి.

 

అయితే దాదాపు ఇలాంటి స్వభావంతోనే ఏపీ కేబినెట్‌లో తొలిసారి మంత్రి కొలువులోకి వచ్చిన కురసాల కన్నబాబు కూడా తన ప్రభుత్వానికి అండగా నిలబడుతూనే...తన పదునైన మాటలతో ప్రతిపక్షాన్ని ఓ ఆట ఆడుకుంటున్నారు. జర్నలిస్ట్‌ కెరీర్ నుంచి పోలిటికల్ ఫీల్డ్‌లో అడుగుపెట్టిన కన్నబాబు...చిరంజీవి ప్రజారాజ్యంతో రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టారు. 2009లో పి‌ఆర్‌పి తరుపున కాకినాడ రూరల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే తర్వాత పి‌ఆర్‌పి కాంగ్రెస్‌లో విలీనం కావడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగారు.

 

ఇక రాష్ట్ర విభజన జరగడంతో కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి ఇండిపెండెంట్‌గానే 2014లో కాకినాడ రూరల్ నుంచి పోటీ చేసి దాదాపు 44 వేలు ఓట్లు తెచ్చుకుని మూడోస్థానంలో నిలిచారు. ఇక తర్వాత వైసీపీలోకి వచ్చి 2019 ఎన్నికల్లో మంచి మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే రాజకీయాలపై పట్టు, రాజ్యాంగంపై మంచి పట్టు, విషయ పరిజ్ఞానం ఉండటంతో జగన్ తన కేబినెట్‌లో చోటు ఇచ్చారు. తొలిసారి మంత్రి పదవి దక్కిన ఏ మాత్రం కంగారు లేకుండా తన శాఖపై పట్టు తెచ్చుకున్నారు.

 

కేవలం 8 నెలల్లోనే సీనియర్ మంత్రులకు ధీటుగా తయారై...సీఎం జగన్ బాటలో నడుస్తూ మంచి పాలకుడుగా పేరు తెచ్చుకున్నారు. ఇక అటు ప్రతిపక్షాలు ఎలాంటి విమర్శలు, రాజకీయం చేసిన ముందుగా స్పందిస్తూ సూటిగా సుత్తి లేకుండా నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తూ ప్రతిపక్షానికి చుక్కలు చూపిస్తున్నారు. అదే సమయంలో తమ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలబడుతున్నారు. ముఖ్యంగా మూడు రాజధానుల విషయంలో ప్రతిపక్ష టీడీపీని ఇటు అసెంబ్లీలో, అటు బయట కూడా మంచి మంచి లాజిక్‌లతో విమర్శలు చేస్తూ ఆడేసుకుంటున్నారు. అసలు ప్రతిపక్షం మళ్ళీ కౌంటర్ ఇవ్వాలేని విధంగా మాట్లాడుతూ చుక్కలు చూపిస్తున్నారు. ఈ విధంగా కన్నబాబు ఓ రాహుల్ ద్రావిడ్ మాదిరిగా జగన్ ప్రభుత్వానికి గొడలాగా నిలబడుతూ ప్రతిపక్షాన్ని చెడుగుడు ఆడుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: