జగన్ సర్కారును ఇరకాటంలో పెట్టాలని చంద్రబాబు వేసిన ప్లాన్ వికటించింది. ఏకంగా శాసన మండలి రద్దుకు దారి తీస్తోంది. ఏపీలో శాసన మండలిని రద్దు చేయాలని జగన్ నిర్ణయానికి వచ్చేశారు. అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇక శాసన మండలిని కొనసాగించడం ఏమాత్రం అవకాశం లేనట్టు కనిపిస్తోంది. అప్పట్లో తన తండ్రి పునరుద్ధరించిన శాసన మండలి ఇప్పుడు ఆయన తనయుడి చేతిలో మూసివేత తప్పదనే అనిపిస్తోంది.

 

ఏడాదికి రూ.60 కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ.300 కోట్లు ఖర్చు అవుతున్న ఇలాంటి సభలను కొనసాగించాలా? వద్దా? అన్న అంశంపై పునరాలోచన చేయాలని జగన్ అన్న తీరు చూస్తే ఇక మండలి మూత ఖాయమేనని చెప్పకతప్పదు. అసలు ఇంతకీ అసెంబ్లీలో జగన్ ఏమన్నాడో చూద్దాం.. దేశంలోని ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండళ్లు ఉన్నాయని, పాలనాపరమైన సూచనలు ఇచ్చే మేధావులు ఉండేలా శాసనమండళ్లు ఏర్పాటయ్యాయని జగన్‌ గుర్తు చేశారు.

 

మండలిలో ఆంగ్ల మాధ్యమం బిల్లును కూడా అడ్డుకున్నారని, అలా అడ్డుకున్న వ్యక్తులెవరూ తమ పిల్లల్ని తెలుగు మీడియంలో చదివించడం లేదన్నారు. పేదలు, సామాన్యులకు ఉపయోగపడే బిల్లులను అడ్డుకోవడం వల్ల వారికి ఏమొస్తుందని జగన్ అసహనం వ్యక్తం చేశారు. ఉన్నత విద్య చదివిన వ్యక్తులు, ఇంజనీర్లు, డాక్టర్లు, విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, జర్నలిస్టులు, విశ్రాంత అఖిల భారత సర్వీసు అధికారులు శాసనసభలో ఉన్నారు. ఇంత మందిని ఉంచుకుని శాసన మండలిని కొనసాగించటంలో ఔచిత్యం లేదు. ‘మండలి కోసం ఏడాదికి రూ.60 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు జగన్.

 

పేదరికంలో ఉన్న రాష్ట్రంలో మండలి కోసం ఇంత ఖర్చు చేయాల్సిన అవసరం ఉందా? అన్నది మా ప్రశ్న. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మండలిని కొనసాగించాల్సిన అవసరముందా? అనే ఆలోచన కూడా ఉత్పన్నమవుతోంది. నిబంధనలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న మండలి ఇక కొనసాగటం ఎందుకన్న భావన అందరిలోనూ ఉందంటున్నజగన్ మాటలు చూస్తే ఇక మండలి మూసివేత లాంఛనప్రాయమేనని అనిపించకమానదు.

మరింత సమాచారం తెలుసుకోండి: