రాజధాని, సీఆర్డీఏ బిల్లులపై వేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో జరిగిన విచారణ వచ్చే నెల 26కి వాయిదా పడింది. 3 రాజధానుల బిల్లును మనీ బిల్లుగా పిటిషనర్ తరపు లాయర్ వాదనలు వినిపించగా.., మనీ బిల్లు కాదని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు.

 

ఏపీ హైకోర్టులో సీఆర్డీఏ రద్దు, ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై కీలక విచారణ జరిగింది. రాజధాని వికేంద్రీకరణ బిల్లు మనీ బిల్లు అని పిటిషనర్ తరపు న్యాయవాది అశోక్‌ భాన్‌ వాదించారు. ఐతే అది మనీ బిల్లు కాదని ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. ఐతే బిల్లు ఏ దశలో ఉందని సీజే అడగడంతో.. అసెంబ్లీలో పాసై మండలికి వెళ్లాయని, అక్కడి నుంచి సెలెక్ట్ కమిటీకి పంపించారని ఏజీ వివరించారు. సెలెక్ట్  కమిటీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని కోర్టుకు తెలిపారు.

 

ఇరువురి వాదనలు విన్న సీజే.. ప్రస్తుతం ఈ బిల్లులపై విచారణ అవసరం లేదని అభిప్రాయపడ్డారు. విచారణ చేయకుంటే ప్రధాన కార్యాలయాలను వైజాగ్‌కు తరలిస్తారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఒకవేళ విచారణ పూర్తయ్యే లోపు కార్యాలయాలను తరలిస్తే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు సీజే. ఇక రాజధాని తరలింపుపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. అనంతరం రాజధాని వికేంద్రీకరణపై దాఖలైన అన్ని కేసుల విచారణను ఫిబ్రవరి 26కు వాయిదా వేసింది.

 

రాజధాని వ్యాజ్యాలపై ఇప్పటికే సీజే జేకే మహేశ్వరి నేతృత్వంలో  త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటైంది. ధర్మాసనంలో జస్టిస్‌ శేషసాయి, జస్టిస్‌ సత్యనారాయణ ఉన్నారు. అమరావతి, సీఆర్డీఏ అంశాలతో ముడిపడిన పిటిషన్లపై బెంచ్ విచారిస్తోంది. రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్‌ అమలు, మూడు రాజధానుల నిర్ణయం, సీఆర్‌డీఏ రద్దుపై పిటిషన్లు దాఖలయ్యాయి.  రాజధానికి సంబంధించి అన్ని కేసుల విచారణ ఫిబ్రవరి 26కి  వాయిదా  వేసింది ధర్మాసనం. ఎంపీలు  విజయసాయి రెడ్డి, కేశినేని నాని ఇవాళ
కోర్డు హాలుకు వచ్చి విచారణ ప్రక్రియను గమనించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: