చంద్రబాబునాయుడుకు పోతుల సునీత షాక్ ఇచ్చింది. తెలుగుదేశంపార్టీ తరపున ఎంఎల్సీగా ఉన్న సునీత గురువారం  జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తన భర్త పోతుల రవితో కలిసి టిడిపి ట్రస్టు బోర్డు ఛైర్మన్ ఎస్వి సుబ్బారెడ్డి,  మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి తో కలిసి జగన్ ను కలిశారు.  నిజానికి సునీత బుధవారం సాయంత్రమే కలుస్తారని వైసిపిలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ వివిధ కారణాల వల్ల జరగలేదు.

 

మొత్తానికి  చాలా హాటుగా రాజకీయాలు జరుగుతున్న నేపధ్యంలో సునీత జగన్ ను కలవటం సంచలనంగా మారింది. ఇప్పటికే మరో ఎంఎల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేశారు.  రూల్ -71 పై మండలిలో ఓటింగ్ జరిగినపుడు సునీత, సిద్దార్ధరెడ్డి వైసిపికి అనుకూలంగా ఓట్లేశారు. దాంతో విప్ ను ధిక్కరించి మరీ వైసిపికి అనుకూలంగా ఓట్లేసినందుకు వీళ్ళద్దరిపై అనర్హత వేటు వేయాలని కోరబోతున్నట్లు ప్రచారం జరిగింది.

 

ఎలాగూ వైసిపికి అనుకూలంగా ఓట్లేయటంతో వీళ్ళిద్దరూ ఇక టిడిపిలో కంటిన్యు అయ్యేందుకు అవకాశాలు తక్కువనే చెప్పాలి. సరే వీళ్ళపై వేటు పడుతుందా లేదా అన్నది వేరే విషయం. ఎందుకంటే తొందరలోనే అసలు శాసనమండలినే రద్దు చేయాలని జగన్ డిసైడ్ చేశారు. ఈ విషయమై సోమవారం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం వచ్చేస్తుంది. కాబట్టి ఎంఎల్సీలుగా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే.

 

ఇక్కడ ఎంఎల్సీ అనేకన్నా సునీత  ప్రకాశం జిల్లా చీరాలలో గట్టి నేతనే చెప్పాలి. 2014లో పోటి చేసి ఓడిపోయారు. అయినా గట్టి క్యాడర్ ఉన్న నేత అనటంలో సందేహం లేదు. కాబట్టి టిడిపిలో గట్టి నేతగా ప్రచారంలో ఉన్నవారిలో చాలామంది అయితే బిజెపిలో లేకపోతే వైసిపిలో చేరటానికి రెడీ అవుతున్నారు.  చంద్రబాబునాయుడు మీద లోకేష్ నాయకత్వాలపైన నమ్మకం కోల్పోవటంలోనే టిడిపిని వదిలేస్తున్నారు. మొత్తానికి ఎంఎల్సీ రద్దయ్యే నేపధ్యంలో జగన్ ను కలిసిన సునీతకు ఏదో గట్టి హామీ లభించినట్లే అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: