మున్సిపల్ ఎన్నికల పోలింగ్ క్రతువు ముగిసింది. మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికపై పార్టీలు కన్నేశాయి.ఈ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యుల పాత్ర కీలకం కావడంతో... అధికారపార్టికి అనుకూలంగా ఉండే అవకాశముంది.

 

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పార్టీలు  ... మున్సిపల్ చైర్మన్,  కార్పొరేషన్ మేయర్ పదవుల కైవసంపై దృష్టి పెట్టాయి.. ఈనెల 27న మధ్యాహ్నం పన్నెండున్నరకు  మేయర్, చైర్మన్  జరగనుంది. దీనికి గానూ ఇప్పటికే ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫలితంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లలో ఎక్స్ అఫిషియో ఓటు హక్కు వినియోగం పై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈనెల 22న జరిగిన మున్సిపోల్స్‌లో 70 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. 79 వార్డులు, మూడు డివిజన్లు ఏకగ్రీవం అయినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.  కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా గెలిచిన సభ్యులు తమరిలో ఒకరిని చైర్మన్, మేయర్‌గా, మరొకరిని వైస్‌చైర్మన్‌, డిప్యూటీ మేయర్‌గా ఎన్నుకోవాల్సి ఉంటుంది. పురపాలికలకు సాధారణ ఎన్నికలు ముగిసిన అనంతరం నిర్వహించే తొలి సర్వసభ్య సమావేశంలోనే చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో పాటు ఎక్స్‌అఫీషియో సభ్యులు సైతం ఈ సమావేశంలో పాల్గొని ఓటేయాల్సి ఉంటుంది. మూజువాణి ఓటింగ్‌ ద్వారా ఎన్నికల్లో పార్టీ విప్‌ మేరకు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఏదైనా కారణంతో తొలి సర్వసభ్య సమావేశం జరిగిన రోజు ఎన్నికలు నిర్వహించలేకపోతే మరుసటి రోజు కచ్చితంగా నిర్వహించాలనే నిబంధన ఉంది.

 

రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కలిగి ఉన్న అధికార పార్టీ ...మున్సిపల్‌ ఎన్నికల్లో సునాయాసంగా అధికార పీఠాన్ని అధిరోహించే అవకాశాలు ఉన్నాయి. మెజారిటీకి ఒక్క ఓటు తక్కువ ఉన్నా ఎక్స్‌అఫీషియో ఓటుతో పీఠాలను కైవసం చేసుకునే వెసులుబాటు అధికార పార్టీకి ఉంది.  శాసనసభ, లోక్‌సభ, శాసన మండలి నియోజకవర్గం పరిధిలో ఏదైనా మున్సిపాలిటీ కానీ దానిలోని కొంతభాగం ఉన్నా, ఆ మున్సిపల్ పాలక మండలిలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉంటారు. ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గం పరిధిలో ఒకటి కంటే అధిక సంఖ్యలో పురపాలికలు ఉంటే ఆ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఇష్టం ప్రకారం వాటిలో ఏదేని ఒక పురపాలికలో ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా చేరాల్సి ఉంటుంది. పురపాలికలకు ఎన్నికలు జరిగిన 30 రోజుల్లోగా సంబంధిత మున్సిపాలిటీ కమిషనర్‌కు రాతపూర్వకంగా తెలియజేస్తే ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ప్రకటిస్తారు. స్థానిక సంస్థల, ఎమ్మెల్యే కోటా, పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎమ్మెల్సీలతో పాటు గవర్నర్‌ నామినేట్‌ చేసిన ఎమ్మెల్సీలు సైతం తమ నియోజకవర్గం పరిధిలోని ఏదైనా ఒక పురపాలికలో ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా నమోదు అవుతారు. అయితే తొలి కౌన్సిల్‌ సమావేశం తేదీలను ప్రభుత్వం త్వరలో ఖరారు చేయనుంది. పాలక మండళ్ల ఐదేళ్ల పదవీకాలం కూడా ... సమావేశం ప్రారంభమైన రోజు నుంచి మొదలవుతుంది. సభ్యులతో తొలుత ప్రమాణ స్వీకారాలు చేయించాక.. కోరం ఉంటేనే చేతులెత్తే పద్ధతిలో ఎన్నికలను నిర్వహిస్తారు. ఒకవేళ కోరం లేకుంటే ఆ సమాచారాన్ని ఎన్నికల సంఘానికి తెలియపరుస్తారు. తదుపరి తేదీని ఈసీ ప్రకటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: