తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకు మూడు రాజధానుల సెగ తగిలింది . విశాఖ వాసి అయి మూడు రాజధానులు మద్దతు తెలియజేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ , వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు , నాయకులు తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు . వైస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ఇంటి ముందు బైఠాయించడం తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది . పోలీసులు రంగప్రవేశం చేసి , వారిని అక్కడి నుంచి పంపించి వేశారు .  

 

విశాఖను పరిపాలక రాజధానిగా ఏర్పాటు చేస్తూ , జగన్ సర్కార్ పరిపాలన వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన విషయం తెల్సిందే . పరిపాలన  వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందగా , మండలిలో టీడీపీ సభ్యులు రూల్ 71 ను తెర పైకి తీసుకురావడం ... చైర్మన్ తన విచక్షణ అధికారం తో సెలెక్ట్ కమిటీ కి పంపడం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ  శ్రేణులు జీర్ణించుకుకోలేకపోతున్నాయి . దీనితో  విశాఖపట్నం రాజధాని కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకత్వం అడ్డుకుంటుందని వైస్సార్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు . పరిపాలన వికేంద్రీకరణ బిల్లును  మండలిలో టీడీపీ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ విశాఖ లో నిరసన ర్యాలీలు చేపట్టిన వైస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు , చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు .

 

 ఆంధ్ర యూనివర్సిటీ బంద్  కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి . ఇక రాయలసీమలోను టీడీపీ కి వ్యతిరేకంగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసనలు ,ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు . ఉత్తరాంధ్ర , రాయలసీమ ల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు గమనిస్తే  మూడు రాజధానుల అంశం టీడీపీ పుట్టి ముంచే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు విన్పిస్తున్నాయి . ఇదే అంశంపై టీడీపీ నేతలను ఎక్కడిక్కడ నిలదీయడం ద్వారా ఆ పార్టీ చర్యలను ఎండగట్టాలని   వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు , కార్యకర్తలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది .  

మరింత సమాచారం తెలుసుకోండి: