ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై రాయలసీమ ప్రాంతంలోని మెజారిటీ శాతం నేతలు హర్షం వ్యక్తం చేస్తుండగా కొందరు నేతలు మాత్రం మూడు రాజధానుల నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం డిమాండ్ ను తెరపైకి తెస్తున్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో గ్రేటర్ రాయలసీమ ప్రాంతానికి చెందిన కీలక నేతలు సమావేశమయ్యారు. 
 
ఈ కీలక సమావేశానికి మైసూరారెడ్డి నివాసం వేదికైంది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని మైసూరా రెడ్డి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో గ్రేటర్ రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతలతో పాటు మాజీ అధికారులు కూడా భేటీ అయినట్టు సమాచారం. ఈ సమావేశంలో కీలకంగా రాజధాని అమరావతిలో జరుగుతున్న ఆందోళనల గురించి చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కూడిన ప్రత్యేక రాయలసీమ డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. 
 
ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు రాజధానిని విశాఖకు తరలించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. విశాఖకు రాజధానిని తరలించడం ద్వారా సీమ ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందుల గురించి, భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చలు జరిపినట్టు సమాచారం. ప్రభుత్వం ఆర్డినెన్స్ ను తీసుకొనివస్తే ఏం చేయాలనే అంశంపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. 
 
రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలుపుకొని ఆరు జిల్లాలతో కూడిన ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ దిశగా ప్రణాళికను రూపొందించినట్టు తెలుస్తోంది. అతి త్వరలో దీనికి సంబంధించిన కార్యాచరణను ప్రకటించబోతున్నారని సమాచారం. ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, రాం భూపాల్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నట్టు తెలుస్తోంది. అతి త్వరలో మరోసారి మైసూరా రెడ్డి నివాసంలో రాయలసీమకు చెందిన నేతలు సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: