ఏపీ సీఎం జగన్ ఏదైనా అనుకుంటే దానిని సాధించే వరకు వదిలి పెట్టారనే విషయం అందరికీ బాగా తెలిసిందే. ప్రజా సంక్షేమానికి సంబంధించి తన నిర్ణయాలపై ప్రతిపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గకుండా జగన్ ముందుకు వెళ్తున్నాడు. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపైన జగన్ దృఢ సంకల్పంతో ఉన్నాడు. కానీ మూడు రాజధానులు బిల్లు శాసనసభలో ఆమోదం పొంది, శాసన మండలిలో తిరస్కరించబడింది. శాసనమండలిలో సభ్యులు ఎటువంటి అభ్యన్తరం లేవనెత్తకుండానే 
సెలెక్ట్ కమిటీకి మండలి చైర్మన్ నిబంధనలకు విరుద్ధంగా పంపించడం జగన్ కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఈ పరిణామాలను జగన్ సీరియస్ గానే తీసుకున్నారు. అందుకే శాసనమండలిని పూర్తిగా రద్దు చేయాలనే ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. 

 

శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉండడంతో తాము ఏ పని చేపట్టినా దానికి టీడీపీ అడ్డు పడుతుందని, ఇది ప్రతి సందర్భంలోనూ తమకు తలనొప్పిగా మారుతుందని జగన్ బలంగా నమ్ముతున్నారు. అందుకే నిన్న ఉదయం నుంచి జగన్ న్యాయనిపుణులతో, సీనియర్ నాయకులతో ఇదే విషయమై చర్చిస్తున్నారు. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే జగన్ న్యాయ నిపుణులతో ఇదే విషయమై చర్చించినట్టు సమాచారం. జగన్ కు ఇంకా నాలుగేళ్లకు పైగా అధికారం ఉంది. మరో రెండున్నర ఏళ్ల పాటు మండలిలో స్థానాలు ఖాళీ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందిన తెలుగుదేశం పార్టీ శాసనమండలిలో పైచేయి సాధించడం జగన్ తట్టుకోలేక పోతున్నారు. 


వాస్తవంగా వైసిపి శాసనమండలిలో తొమ్మిది మంది మాత్రమే సభ్యులు ఉన్నారు. వారిలో ఇద్దరు మంత్రులు.ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందినా చంద్రబాబు ఇంకా తనపై పట్టు సాధించేందుకు ఇలా వ్యవహరిస్తున్నాడని, ఇకపై రాజకీయ దురుద్దేశంతో ప్రతి బిల్లును శాసనమండలిలో అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తారని జగన్ భావిస్తున్నారు. ఇక నిన్న జరిగిన అసెంబ్లీలోనూ జగన్ మండలిని రద్దు చేయబోతున్నాము అనే సంకేతాలు ఇచ్చారు. ఏడాదికి 60 కోట్లు పైగా శాసన మండలికి ఖర్చవుతోంది అంటూ లెక్కలు చెబుతున్నారు. 


అలాగే ప్రజలకు ఉపయోగపడే బిల్లులు సైతం శాసనమండలిలో టీడీపీ అడ్డుకుంటోందని జగన్ ఆగ్రహంగా ఉన్నారు. ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే త్వరలోనే శాసన మండలి రద్దు చేసే ప్రక్రియకు జగన్ శ్రీకారం చుట్టారనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: