పటాన్ చెరు సమీపంలోని అమీన్ పూర్ లో బాలికపై అత్యాచారం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మొదట నలుగురు యువకులు తనపై అత్యాచారం చేశారంటూ పోలీసులకు తెలిపిన బాలికకు వైద్యులు వైద్య పరీక్షలు చేయగా వైద్య పరీక్షల్లో రేప్ జరగలేదని తేలడంతో షాక్ అవ్వడం పోలీసుల వంతయింది. సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం వైద్యులు రేప్ జరగలేదని తేల్చటంతో మహిళా ఎస్సై మరోసారి బాలికను ప్రశ్నించగా బాలిక పొంతన లేని సమాధానాలు చెప్పింది. 
 
మొదట అత్యాచారం చేశారంటూ చెప్పిన బాలిక ఆ తరువాత మాత్రం తనపై అత్యాచారయత్నమే జరిగిందని మాట మార్చింది. బాలిక పొంతన లేని సమాధానాలు చెప్పటంతో పోలీసులు దర్యాప్తు చేసి ఆ తరువాత కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెబుతున్నారు. బాలిక నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారయత్నం చేశారని అదే సమయంలో అటు వైపుగా కారు రావడంతో తనను వదిలేసి వెళ్లారని చెబుతోంది. 
 
ఎస్పీ ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు. ప్రత్యేక బృందాలను నిందితులను పట్టుకోవడం కొరకు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నిన్న అత్యాచారం జరిగిందని బాలిక చెబుతున్న ప్రాంతంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో సీసీ కెమెరాలు పని చేయలేదని తెలుస్తోంది. అమీన్ పూర్ పోలీసులకు నిన్న 16 సంవత్సరాల వయస్సు గల మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడినట్టుగా బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 
 
బాలిక తన తల్లిదండ్రులకు కట్టుకథ చెప్పిందా..? లేక నిజమే చెప్పిందా.? అనే విషయాలు విచారణలో తెలిసే అవకాశం ఉంది. బాధితురాలి కుటుంబ సభ్యులు రెండు సంవత్సరాల క్రితం శ్రీకాకుళం నుండి హైదరాబాద్ కు వచ్చి వాణీ నగర్ లోని ఒక అపార్టుమెంట్ లో పనికి కుదిరారు. శ్రీకాకుళం జిల్లాలో అమ్మమ్మ వద్ద ఉండే బాలిక కొన్ని రోజుల క్రితం తల్లిదండ్రులను చూడటానికి వాణీ నగర్ కు వచ్చింది. బాధితురాలిపై అత్యాచారం జరగలేదని వైద్యులు తేల్చటంతో ఈ కేసులో నిజానిజాలు పోలీసుల విచారణలో వెల్లడయ్యే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: