తెలంగాణ‌లో పూర్త‌యిన మున్సిపాలిటీ ఎన్నిక‌ల ఫ‌లితాల విడుద‌లకు కొన్ని గంట‌ల వ్య‌వ‌ధి మాత్ర‌మే ఉంది. తామే గెలుస్తున్నామ‌ని పైకి ప్ర‌తి పార్టీ ప్ర‌క‌టించుకుంటున్న‌ప్ప‌టికీ...స‌హ‌జంగా లోలోప‌ల డౌట‌నుమానాలు స‌హ‌జంగానే ఉంటున్నాయి. ఫ‌లితాలు 25న వెలువ‌డుడుతండ‌టం, 27నే చైర్మ‌న్లు-మేయ‌ర్ల ఎన్నిక జ‌రుగుతుండ‌టం ఆయా పార్టీల‌కు మ‌రింత టెన్ష‌న్ పుట్టిస్తోంది. శనివారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు జరుగనుంది. అదేరోజున జిల్లాల కలెక్టర్లు.. తమ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌, మేయర్‌, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు నోటీసు జారీచేస్తారు.

 


రాష్ట్రంలో తాజాగా ఎన్నికలు జరిగిన ఎన్నికల్లో గెలిచిన వార్డు సభ్యులు 27 ఉదయం 11 గంటలకు సంబంధిత మున్సిపల్‌ కార్యాలయాల్లో ప్రమాణం స్వీకరించేందుకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నాగిరెడ్డి గురువారం షెడ్యూలు విడుదలచేశారు. తొలుత వార్డు సభ్యుల ప్రమాణం జరుగుతుంది. ఆ తర్వాత చైర్‌పర్సన్‌, మేయర్‌ ఎన్నిక ప్రక్రియ మొదలవుతుంది. అనంతరం వైస్‌ చైర్‌పర్సన్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక చేపడతారు. ఒకవేళ కోరం లేకపోవడం.. ఇతరత్రా కారణాలవల్ల ఎన్నిక వాయిదాపడితే మరుసటిరోజు (ఈ నెల 28న) ఎన్నిక నిర్వహించ‌నున్నారు. 

 


ఇదిలాఉండ‌గా, మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు సూచించారు. గురువారం దావోస్‌ నుంచి పార్టీ రాష్ట్ర సమన్వయకమిటీ సభ్యులతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. పోలింగ్‌ ప్రశాంతంగా జరుగటం పట్ల ఓటర్లకు, పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఓట్ల లెక్కింపురోజున కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. స్థానిక సంస్థల్లో తక్కువ ఓట్లు ఉన్నందున ప్రతి ఒక్క ఓటు విలువైనదేనని, ఒకటి రెండు ఓట్ల తేడాతో గెలుపోటములు ప్రభావితమయ్యే అవకాశముంటుందని, ప్రత్యర్థులు ఓటమి భయంతో గందరగోళపర్చాలని చూస్తారని అలాంటి వాటికి ఆస్కారం లేకుండా జాగ్రత్తపడాలని తెలిపారు. పోలింగ్‌ బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా జరిగినందున లెక్కింపు సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. నిబంధనల ప్రకారం చెల్లని ఓట్లు, చెల్లబాటు అయ్యే ఓట్లు తదితర వాటిపై స్పష్టమైన అవగాహన ఉండాలని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీని ప్రజలు ఆదరించారని, గెలుపు గులాబీ జెండాదేనని మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తంచేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: