పరిసరాలకు అనుగుణంగా ఊసరవెల్లి ఏ విధంగా అయితే తన రంగులు మార్చుకుంటుందో, రాజకీయ అవసరాల కోసం కొంతమంది నాయకులు కూడా అదే విధంగా తమ తమ నిర్ణయాలు మార్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆ వరుసలో ముందు వరుసలో ఉండే వ్యక్తి టిడిపి అధినేత చంద్రబాబు అనే అభిప్రాయం జనాల్లో ఉంది. అవసరమైతే ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకోవడం, అవసరం తీరాక వారి వల్ల ఉపయోగం లేదు అనుకుంటే విమర్శలు చేసి పొత్తు రద్దు చేసుకోవడం మొదటి నుంచి చంద్రబాబుకు అలవాటుగా మారింది అనే వ్యాఖ్యలు లేకపోలేదు. తెలంగాణలో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకోవడంపై అప్పట్లోనే పెద్ద విమర్శలు వచ్చాయి. ఇక వైసీపీ మినహా చంద్రబాబు పొత్తు పెట్టుకోని పార్టీ అంటూ లేదు.


 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సగం రోజులు బీజేపీతో పొత్తు పెట్టుకుని, ఆ పార్టీకి ఆదరణ తగ్గుతోందని తెలియగానే ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ పొత్తు రద్దు చేసుకున్నారు. ఇక ఇప్పుడు రాజకీయంగా టిడిపి బలహీనపడడంతో మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకునే విధంగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. యూటర్న్ రాజకీయాలతో పెట్టింది పేరుగా ఉన్న చంద్రబాబు తమ పార్టీ నుంచి బీజేపీ లోకి చేరిన కొంతమంది ఎంపీల ద్వారా బిజెపి అగ్ర నాయకులతో రాయబారం పంపుతున్నారట. అలాగే ఎప్పటికప్పుడు బీజేపీ లో జరుగుతున్న పరిణామాలను కూడా ఆరా తీస్తున్నారు. ఓ వైపు నరేంద్ర మోదీ, ఇంకోవైపు అమిత్ షాల దగ్గర రాయబారం చేసేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 


దీనికి మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరితో పాటు మరికొంతమంది ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన అనుకూల వ్యక్తిగా ముద్రపడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అదేవిధంగా తాము పొత్తు పెట్టుకుంటే మళ్ళీ ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పవచ్చని చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. దీనిపై వైసీపీ కూడా ఆరా తీస్తోంది. ఎప్పటికప్పుడు టిడిపి, బీజేపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలను పసిగట్టే పనిలో ఉంది. అయితే చంద్రబాబు బీజేపీ నేతలు చేరదీస్తారా అనేది అనుమానమే. 


ఎందుకంటే గతంలో టీడీపీ బీజేపీ పొత్తు రద్దయిన తర్వాత బిజెపిపై, ఆ పార్టీ పెద్దలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ  మోదీ, అమిత్ షాలు మర్చిపోలేదని, అలాగే తిరుపతిలో అమిత్ షా కారుపై టిడిపి నాయకులు రాళ్ల దాడి చేయడం వంటి సంఘటనలు ఆ పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో టీడీపీతో బీజేపీ జత కట్టే అవకాశమే లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: