ఏపీ సీఎం జగన్ గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేసిన మూడు రాజధానుల నిర్ణయానికి అంతా అనుకూలంగా జరుగుతుందన్న సమయంలో శాసన మండలి మూడు రాజధానుల బిల్లును సెలక్ట్ కమిటీకి పంపడంపై వైసీపీ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మండలిలో  ఘోర పరాభవానికి కారణమైన టీడీపీ పార్టీపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని వైసీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు మరియు మంత్రులు ఇప్పటికే శాసనమండలిని రద్దు చేయాలని ప్రతిపాదనలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మండలి ఖచ్చితంగా రద్దు కానుందని వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. శాసనసభ ద్వారా మంత్రులుగా ఎన్నికై పదవులను నిర్వహిస్తున్న వైసీపీ మంత్రులు కూడా శాసనమండలిని రద్దు చేయాలని బహిరంగంగానే కోరుతూ ఉండటం గమనార్హం. 
 
కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం మండలిని రద్దు చేయకుండానే చంద్రబాబుకు షాక్ ఇవ్వబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలను వైసీపీ వైపు తిప్పుకునే విధంగా జగన్ ప్రణాళిక రచించాడని తెలుస్తోంది. 10 మంది టీడీపీ ఎమ్మెల్సీలను చేర్చుకోవటం ద్వారా లక్ష్యాన్ని సాధించాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. వైసీపీ పార్టీ 10 మంది ఎమ్మెల్సీల మద్దతును కూడగట్టుకొని ఛైర్మన్ పై అవిశ్వాసం పెట్టి ఛైర్మన్ ను సాగనంపాలని భావిస్తోంది. ఆ తరువాత కొత్త ఛైర్మన్ ను నియమించుకొని మూడు రాజధానుల బిల్లు మండలిలో ఆమోదం పొందేలా ప్రణాళిక రచించినట్టు తెలుస్తోంది. 
 
మూడు రాజధానుల బిల్లు అమలు దిశగా సత్తా చాటాలనే లక్ష్యంతో వైసీపీ ముందడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. మూడు రోజుల్లో పది మంది టీడీపీ ఎమ్మెల్సీల మద్దతు సాధించలేకపోతే శాసన మండలిని రద్దు చేస్తూ బిల్లును పాస్ చేసే యోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మూడు రోజుల్లో వైసీపీ ప్రభుత్వం ఏం చేయనుందో చూడాల్సి ఉంది. ఏపీ సీఎం జగన్ తన వ్యూహాలతో 40 సంవత్సరాల అనుభవం అని పదే పదే చెప్పుకునే చంద్రబాబుకు భారీ షాక్ ఇవ్వడం మాత్రం ఖాయం అని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: