ఏపీ శాసన మండలి రద్దుకు కౌంట్‌డౌన్ మొదలయిందా ? అసెంబ్లీలో వైసీపీ నేతల వ్యాఖ్యలు చూస్తే...పెద్దల సభను రద్దు చేసేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. నిన్న మండలిలో జరిగిన పరిణామాలను తీవ్రంగా పరిగణించిన వైసీపీ  ..నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఈ మండలి మనకు అవసరమా? అంటూ వ్యాఖ్యానించింది.  సోమవారం దీనిపై సభలో చర్చించి నిర్ణయం తీసుకోనుంది సర్కారు.

 

రాజధాని విభజన బిల్లుపై మండలిలో జరిగిన పరిణామాలు చివరికి ఆ సభ ఉనికికే ముప్పు తెచ్చాయి. రూల్స్ కి విరుద్ధంగా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారని , అసలు ఇలాంటి సభ అవసరం లేదని నిన్న రాత్రి నుంచి చెబుతూ వస్తున్న అధికార పక్షం ఈరోజు.. అసెంబ్లీలో ఈ అంశాన్ని చర్చకు పెట్టింది. ఇటు నిబంధనలను అతిక్రమిస్తూ.. అటు ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్న మండలి ఉండాల్సిన అవసరం ఏంటని ముఖ్యమంత్రి జగన్  ప్రశ్నించారు.

 

రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అనే పదం లేదన్నారు ఏపీ సీఎం జగన్.  జయలలిత గతంలో ఊటీ నుంచి పాలించారని, చంద్రబాబు హుద్ హుద్ వచ్చినప్పుడు విశాఖ నుంచే పాలించారని జగన్ గుర్తుచేశారు.  
దేశంలో కేవలం 6 రాష్ట్రాల్లోనే మండళ్లు ఉన్నాయని.. రోజుకు కోటి రూపాయలు ఖర్చయ్యే మండలి మనలాంటి పేద రాష్ట్రానికి అవసరమేముందని అన్నారు సీఎం జగన్. దీనిపై అందరం తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 

    
నిబంధనలకు విరుద్ధంగా, ప్రజలకు జరిగే మేలును ఆలస్యం చేస్తున్న మండలి ఉండాలా.. వద్దా అనేది సీరియస్ గా ఆలోచించాలన్నారు ఏపీ సీఎం జగన్. దీనిపై సోమవారం ప్రత్యేకంగా సమావేశం పెట్టి చర్చకు అనుమతించాలని స్పీకర్ ను కోరారు. మొత్తం మీద... మరింత విపులంగా చర్చించి మండలి ఉండాలా లేదా తేల్చాలని అభిప్రాయ పడుతూ ఈ రోజు అసెంబ్లీ ముగిసింది. సోమవారం  చర్చ అనంతరం మండలి రద్దుపై ఓటింగ్ నిర్వహించే అవకాశముంది.  దీంతో మండలి రద్దుకు సభ తీర్మానం చేయడం ఖాయంగా కనబడుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: