అభివృద్ధి నిరోధకంగా నిలుస్తున్నప్పుడు మండలిని కొనసాగించాల్సిన అవసరం ఏముందని.. ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. రాజధాని వికేంద్రీకరణ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపే ప్రక్రియలో.. నిబంధనలు పాటించలేదని సీఎం జగన్ తో పాటు మంత్రులు అభిప్రాయపడ్డారు. పెద్దల సభగా విలువైన సలహాలు ఇవ్వాల్సిందిపపోయి.. రాజకీయ అజెండాతో వ్యవహరించడం తీవ్ర అభ్యంతకరమన్నారు. మండలి ఉండాలా.. లేదా అనే అంశంపై సోమవారం అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చ జరగనుంది.  

 

ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లు.. మండలికి ఎసరు పెట్టే పరిస్థితి వచ్చింది. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపడంపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. సీఎం జగన్ ఇగో హర్టైందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. దీంతో ఇంతకుముందు చెప్పినట్టుగానే మండలి రద్దుకు సర్కారు రెడీ అవుతోంది. ఇప్పటికే అసెంబ్లీలో జరిగిన చర్చలో దీనిపై హింట్ ఇచ్చింది. సోమవారం జరిగే ప్రత్యేక అసెంబ్లీ సెషన్లో.. మండలి భవితవ్యం తేలనుంది. 

 

మండలి ఛైర్మన్ విచక్షణాధికారం పేరుతో అప్రజాస్వామికంగా వ్యవహరించారని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. గ్యాలరీలో ఛైర్మన్ కు నేరుగా కూర్చుని చంద్రబాబు ప్రభావితం చేశారని మండిపడ్డారు. మండలిలో జరిగిన వ్యవహారాల్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి బుగ్గన. రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై మండలి తీసుకున్న నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఆ సభ ఉండాలా.. లేదా అనే విషయం ఆలోచించాలన్నారు ఏపీ మంత్రి మోపిదేవి.  సభలు అభివృద్ధి నిరోధకంగా తయారైనప్పుడు.. అవి కొనసాగాలా.. వద్దా అనేది ఆలోచించాల్సిందేనన్నారు మరో వైసీపీ నేత అంబటి రాంబాబు.

 

 పెద్దల సభ పెట్టిన ఉద్దేశాలు నెరవేరడం లేదని, అది రాజకీయాలకు కేంద్రంగా మారిందని అభిప్రాయపడ్డారు వైసీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్. తాను మండలి సభ్యుడ్ని అయినా సభ రద్దుకు సిఫార్సు చేస్తున్నట్టు చెప్పారు. అయితే మండలి రద్దు ప్రక్రియ పూర్తి కావడానికి ఏడాది సమయం పడుతుందని అంచనా. అంతవరకూ సెలక్ట్ కమిటీ పనిచేసుకుపోతుందని, దానికేమీ ఆటంకం లేదని టీడీపీ చెబుతోంది. ప్రభుత్వం మండలి రద్దు తీర్మానం పాస్ చేసినా.. దీనిపై కోర్టుకు కూడా వెళ్లే అవకాశం ఉందని తెలుగుదేశం వాదిస్తోంది. మరి సోమవారం అసెంబ్లీలో ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: