ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం ఎంత హాట్ గా ఉందో.... ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ అధిష్టాన వైఖరి ఏంటన్నదీ అంతే ఆసక్తిగా ఉంది. రాజధానుల విభజనను ఆపగల శక్తి ఇప్పుడు ఒక్క బీజేపీ నాయకత్వానికేనని ఏపీలో చాలా మంది నమ్ముతున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం తలపెట్టబోతున్న శాసనమండలి రద్దు అంశంలో కూడా వైసీపీకి బీజేపీ సహకారం కావాల్సి ఉండటంతో ఏం జరుగబోతోందన్న చర్చ మొదలైంది.

 

ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల వ్యవహారంలో బీజేపీ అగ్రనాయకత్వం జగన్ కు సహకరిస్తుందా? లేదా? అన్న సందేహం అందరిలో కనిపిస్తోంది. కానీ జగన్ మాత్రం తాను చేయాలనుకుంటున్న మూడు రాజధానుల ఏర్పాటు, మండలి రద్దు సహా ముఖ్యమైన పనులు చేసుకుపోతున్నారు. మూడు రాజధానులకు కేంద్ర ప్రభుత్వ అనుమతితో పని లేకున్నా... మండలి రద్దు విషయంలో మాత్రం అవసరం ఉంటుంది. రాష్ట్రంలో గత నెల రోజులుగా ఇంత జరుగుతున్నా బీజేపీ రాష్ట్ర నాయకులు తలో మాట మాట్లాడుతున్నారు.. తప్పించి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి జగన్ కు వ్యతిరేకంగా కానీ అనుకూలంగా ఒక్క మాట రాలేదు. దీంతోనే బీజేపీ ఏం చేస్తుంది? ఆ పార్టీ మదిలో ఏం ఉంది? జగన్ కు సహకరిస్తుందా? జగన్ నిర్ణయాలను వ్యతిరేకిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

 

అయితే బీజేపీతో జగన్ కు పూర్తి అవగాహన ఉన్నట్టు సమాచారం. అన్ని విషయాల్లో బీజేపీ అగ్ర నాయకత్వం జగన్ కు అండగా నిలుస్తోందని తెలిసింది. ఈ రెండు పార్టీల సంబంధాలపై బయట ఎన్ని చర్చలు జరిగినా... లోపల మాత్రం కీలక విషయాలలో బీజేపీ నాయకత్వంతో జగన్ టచ్ లోనే ఉన్నారని సమాచారం. అందుకే రాజధానుల వ్యవహారంలో జగన్ స్పీడ్ ఏ మాత్రం తగ్గించడంలేదు. ఇరుపక్షాల మధ్య స్పష్టమైన అవగాహన ఉన్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో జగన్ వ్యవహారిస్తున్నారని... బీజేపీ వైపు నుంచి కూడా సేమ్ అదే జరుగుతోందని అంటున్నారు. అందుకే జగన్ అంత ధీమాతో ఉన్నారని చెబుతున్నారు.

 

జగన్ ప్రభుత్వం తాజాగా శాసనమండలి రద్దు ఆలోచన చేస్తోంది. గురువారం అసెంబ్లీలో దీనిపై కొద్ది సేపు చర్చించిన ప్రభుత్వం మండలి రద్దు వైపే మొగ్గు చూపింది. సోమవారం పూర్తి స్థాయి చర్చ తర్వాత తీర్మానం చేయాలనే ఆలోచనలో వైసీపీ ఉంది. అయితే మండలి రద్దుకు కేంద్ర ప్రభుత్వ సహకారం కావాల్సి ఉంటుంది.  మండలి రద్దుకు పార్లమెంట్ ఉభయ సభల్లో తీర్మానాలు చేయడంతో పాటు.. రాజ్యాంగ సవరణ కూడా చేయాల్సి ఉంది. ఈ మొత్తం ప్రక్రియకు సుధీర్ఘ సమయం పట్టే అవకాశం ఉన్నా.... బీజేపీతో ఉన్న అవగాహన కారణంగా నెలల వ్యవధిలోనే ఈ తంతు ముగించవచ్చనే ఆలోచనలో జగన్ ఉన్నారు. దీనికి కారణం బీజేపీ అగ్రనాయకత్వంతో ఆయనకు ఉన్న సాన్నిహిత్యమే కారణం.

 

రాజధానుల వ్యవహారానికి ప్రధాని మోడీ, అమిత్ షాల ఆమోదం లేదని... వాళ్లకు ఏం తెలియదని కొత్తగా బీజేపీతో జత కట్టిన పవన్ కల్యాణ్... చెబుతున్నారు తప్పించి కేంద్ర నాయకత్వం ఎక్కడా ఆ ప్రకటన చేయడం లేదు. దానికి కారణం జగన్ తో ఆ పార్టీకి ఉన్న అవగాహనే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: