దావోస్‌లో మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. కీపింగ్ పేస్ టెక్నాలజీ- టెక్నాలజీ గవర్ననెన్స్ ఎట్ క్రాస్ రోడ్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇక టాప్‌ కంపెనీ అధినేతలతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాలని సౌదీ మంత్రిని ఆహ్వానించారు.


వరల్డ్ ఎకనామిక్‌ ఫోరమ్‌లో మంత్రి కేటీఆర్ బిజీ బిజీగా గడుపుతున్నారు. మూడో రోజు వరుస సమావేశాలు, పెట్టుబడులపై చర్చలతో గడిచిపోయింది. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు కేటీఆర్‌. ముందు సౌదీ కమ్యూనికేషన్స్ మినిస్టర్‌ అబ్దుల్లా అల్ స్వాహను కలిశారు. హైదరాబాద్‌లో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాల పరిశీలనకు తెలంగాణకు రావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రతో భేటీ అయ్యారు. యూట్యూబ్ సీఈవో సుసాన్  వొజ్విక్కి తోనూ సమావేశమయ్యారు. కోకో కోలా కంపెనీ సీఈవో జేమ్స్ క్వెన్సి  కూడా మంత్రి కేటీఆర్‌ను కలిశారు. 

 

కేటీఆర్‌కు ఆర్థిక వేదిక సదస్సులో అరుదైన గౌరవం దక్కింది. ఇన్‌ఫార్మల్‌ గ్యాదరింగ్‌ ఆఫ్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ లీడర్స్‌  భేటీకి కేటీఆర్‌ హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానం మేరకు  కీపింగ్‌ పేస్‌ టెక్నాలజీ సదస్సులో ప్రభుత్వాధినేతలు,  కేంద్ర సీనియర్‌ మంత్రులతో పాటు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ప్రభుత్వాధినేతలు, కేంద్ర  ప్రభుత్వాల్లో ప్రభుత్వ పాలసీ నిర్ణయించే సీనియర్ మంత్రులు మాత్రమే హాజరవుతారు. రాష్ట్ర స్థాయి  ఆహ్వానితుల్లో ఈ సమావేశానికి హాజరైన ఏకైక లీడర్‌ కేటీఆర్ ఒక్కరే. ఈ సమావేశం కోసం వరల్డ్ ఎకనామిక్  ఫోరం మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక బ్యాడ్జ్‌ను అందించింది. హెచ్‌సీఎల్ రిసెప్షన్ దగ్గర మాజీ క్రికెటర్ ఆస్ట్రేలియా  బౌలర్ మెక్‌గ్రాత్‌ను క‌లిశారు.  త‌న మాట‌లు విని.. ఎంతో ఆప్యాయంగా భుజం త‌ట్టిన‌ట్లు మంత్రి  కేటీఆర్ త‌న ట్వీట్ చేశారు. మొత్తానికి తెలంగాణ ఐటీి శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: