పచ్చని అడవుల్లో పండగల సంబరాలు మొదలయ్యాయి. దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన  జాతర నాగోబాకు నేడు అంకురార్పణ జరగనుంది. మేస్రం వంశీయుల ఆరాధ్యదైవమైన నాగోబా  మహజాతరకు పెద్ద సంఖ్యలో గిరిజనులు తరలివస్తున్నారు. 

 

ఆదిలాబాద్ అంటే ఆదివాసీ, గిరిజనుల పుట్టినిల్లే కాదు...అరుదైన సంస్కృతి, సంప్రదాయాల కలబోత. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఉందీ నాగోబా ఆలయం.  ఈ సీజన్ వచ్చిందంటే చాలు...కేస్లాపూర్‌లో పండగ వాతావరణం కన్పిస్తుంటుంది. ఆనాటి నుండి మేస్రం వంశీయులే ఏటా ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతీఏటా జరిగే గిరిజన మహాజాతర నాగోబాకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో గిరిజనులు తరలివస్తుంటారు. మొత్తం వారం రోజుల పాటు కొనసాగే ఈ జాతరకు ఈ రోజు రాత్రి అంకురార్పణ జరగనుంది.

 

నాగోబా సన్నిధిలో ఈ రోజు  రాత్రి  మహాపూజ, తర్వాత సతక్ ఉంటాయి. అలాగే రేపు ఎల్లుండి పెర్సాపేన్, బాస్క్ దేవత పూజ నిర్వహిస్తారు. ఇక 27న దర్బార్ నిర్వహించి ఆదివాసీల సమస్యల పరిష్కరిస్తారు. ఈనెల 28న మండగాజ్ లింగా జరగనుండగా... 31తో జాతర ముగుస్తుంది. అయితే ఈ జాతర చెప్పుకోవడానికి మేశ్రం వంశీయులదే అయినప్పటికి ఏటికేడు గిరిజనేతర భక్తుల రద్ది తీవ్రంగా పెరుగుతుంది. దీంతో అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేశారు అధికారులు. 

 

జాతరలో ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు, వారి జీవన విధానానికి నిలువుట్టదంగా నిలుస్తాయి. నియమనిష్టలకు కొదవలేదు. కాలికి చెప్పులు లేకుండా వందల కిలోమీటర్లు నడిచి వెళ్లి తెచ్చిన గంగాజలం, దారి వెంట పవిత్ర పూజలు, ఎడ్లబండ్లలో ప్రయాణం, ఆదివాసీ సంస్కృతికి సంప్రదాయాలకు అద్దం పడతాయి. 

 

మొత్తానికి నాగోబా జాతరకు సర్వం సిద్ధమైపోయింది. ఇక అంకురార్పణే తరువాయి. ఈ ఘట్టం కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ ఆరాధ్య దైవాన్ని భక్తిశ్రద్ధలతో కొలిచేందుకు సిద్దమయ్యారు. మొక్కులు చెల్లించుకునేందుకు.. పదార్థాలు రెడీ చేసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: