మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తిక్క చేష్టల వలన, నియంత పోకడల వలన రాష్ట్రం అప్రతిష్ట పాలవుతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గడచిన 8 నెలలుగా రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని చెప్పారు. మీడియాపై తప్పుడు కేసులను బనాయిస్తున్నారని తాను ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.                  
 
రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముగ్గురు మంత్రులు సమావేశం పెట్టి మరీ ఎంఎస్‌వోలను బెదిరించారని అన్నారు. అసెంబ్లీ ప్రసారాలు చేయకుండా మూడు ఛానళ్లపై ప్రభుత్వం నిషేధం విధించిందని రెండు ఛానళ్ల ప్రసారాలపై ఆంక్షలు పెట్టారని చెప్పారు. మీడియాపై ప్రభుత్వం జీవో 2430 తెచ్చి ఉక్కుపాదం మోపిందని అన్నారు. వైసీపీ నేతలు మీడియాపై దౌర్జన్యం చేస్తే ఏం చేశారని ప్రశ్నించారు. 
 
చీరాలలో విలేకరిపై హత్యాయత్నం జరిగిందని తునిలో విలేకరిని హత్య చేశారని చంద్రబాబు అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే నెల్లూరులో ఎడిటర్ పై దౌర్జన్యం చేశారని చెప్పారు. పాత్రికేయులకు ఏపీలో రక్షణ లేకుండా వైసీపీ ప్రభుత్వం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఫోర్త్ ఎస్టేట్ మనుగడకే ముప్పు తెచ్చిందని అన్నారు. మీడియా గొంతు నులిమే నియంత పోకడలను ఖండిస్తున్నామని చెప్పారు. 
 
కాలగర్భంలో ఇలాంటి నియంతలంతా కలిసిపోయారని చంద్రబాబు అన్నారు. పోలీసులు మందడంలోని పాఠశాలలోని తరగతి గదిని ఆక్రమించారని అన్నారు. తరగతి గదిలో ఆరేసిన పోలీస్ దుస్తులను ఫోటో తీయడంతో ముగ్గురు జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టారని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వ కక్ష సాధింపునకు పరాకాష్ట మీడియాపై నిర్భయ కేసు పెట్టడం అని చంద్రబాబు చెప్పారు. జర్నలిస్ట్ లపై తప్పుడు కేసులు పెట్టారని ఆ కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: