ఏపీలో రాజధానిని అడ్డం పెట్టుకొని అటు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ, ఇటు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ, జనసేన పార్టీ రాజకీయాలు చేస్తున్నాయి. ఈ విషయంలో ఏ పార్టీకి మినహాయింపు లేదు. మూడు పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం రాజధాని విషయంలో రాజకీయాలే చేస్తున్నాయి. టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు రాజధానిగా అమరావతే కొనసాగాలని అమరావతిలో గళం విప్పుతున్నప్పటికీ ఉత్తరాంధ్ర గడ్డపై మాత్రం ఆ మాట చెప్పలేకపోతున్నారు. 
 
వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను పెట్టడానికి ఒకరకంగా చంద్రబాబే కారణమనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. గడచిన ఐదేళ్లలో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు తాత్కాలిక నిర్మాణాలే తప్ప శాశ్వత నిర్మాణాల దిశగా అడుగులు వేయలేదు. ఐదేళ్లుగా అమరావతిని గ్రాఫిక్స్ లో అద్భుతంగా చూపించిన చంద్రబాబు అమరావతిని అభివృద్ధి చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. 
 
వైసీపీ ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల గురించి ప్రకటన చేసింది. ఆ తరువాత అమరావతిలో రైతుల ఆందోళనలు మొదలయ్యాయి. అమరావతి కూడా ఏపీకి ఒక రాజధానిగా కొనసాగుతుందనే మాట వాస్తవం. కానీ వైసీపీ మూడు రాజధానుల ప్రకటన వలన రాజధాని రైతులకు ఎటువంటి నష్టం లేదని నిరూపించడంలో విఫలమవుతోంది. అమరావతి గ్రామాల ప్రజలకు ఏపీకి మూడు రాజధానుల అవసరం గురించి వివరించి ఆందోళన చేస్తున్న రైతులకు చెప్పడంలో వైసీపీ ఫెయిల్ అయిందనే చెప్పవచ్చు. 
 
ఏపీలో కొన్ని రోజుల క్రితం బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ కూడా రాజధాని విషయంలో స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయటంలో విఫలమవుతోంది. ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి కావాలని చెబుతోన్న పవన్ కళ్యాణ్ ఏపీకి మూడు రాజధానులు ఎందుకు వద్దనే విషయంపై మాత్రం స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేయలేకపోతున్నారు. రాజధానిని అడ్డం పెట్టుకొని మూడు పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని ప్రజల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: