ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ నిర్ణ‌యంపై విప‌క్షాల విమ‌ర్శ‌లు, ప్రాంతాల వారీగా వ‌స్తున్న స్పంద‌న‌లు ఎలా ఉన్నా ఈ విష‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి తీరును ప‌లువురు విమ‌ర్శ‌నాత్మ‌కంగానే చూస్తున్నారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నిర్ణ‌యం స‌రైన‌ది అని అంటున్న వారు కూడా...గురి ఎక్క‌డో తప్పింద‌నే కామెంట్లు చేస్తున్నారు. ప‌ర్‌ఫెక్ట్ టైమింగ్ చూసి కొట్టాలే కాని ఇలా విప‌క్షాలు అల్ల‌రి చేసేందుకు ఛాన్స్ ఇవ్వ‌కూడ‌ద‌న్న మాట‌...తాజాగా శాస‌న‌మండ‌లిలోని ప‌రిణామాలు, ఇత‌ర‌త్రా ఘ‌ట‌న‌ల రీత్యా ప్ర‌స్తావిస్తున్నారు. 

 

అసెంబ్లీలో ఆమోదించుకున్న‌ప్పటికీ...టీడీపీకి మెజార్టీ ఉన్న శాస‌న‌మండ‌లి ద్వారా రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సెలెక్ట్ కమిటీకి వెళ్లకూడదన్న వైసీపీ వ్యూహం విఫలమైంది. ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ సెలెక్ట్ కమిటీకి పంపించి తీరాల‌నే టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం ఫలించి బిల్లు సెలెక్ట్ కమిటీ బాట పట్టింది. అయితే, ఈ బిల్లు విషయంలో ప్రభుత్వం  తొంద‌ర‌ప‌డుతోందా? అనే మాట అన్ని రాజ‌కీయ ప‌క్షాల్లోనే కాకుండా ప్ర‌జ‌ల్లోనూ వినిపిస్తోంది. 

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం వికేంద్రీక‌ర‌ణ చేప‌ట్టామ‌ని చెబుతున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈ విష‌యంలో అడుగ‌డుగునా తొంద‌ర‌ప‌డుతోంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. రాజధాని వికేంద్రీకరణ ప్రక్రియను ఆగమేఘాల మీద ముగించాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం ఈ ఆతృతలో చంద్ర‌బాబు గేమ్ ప్లాన్‌ను త‌క్కువగా అంచ‌నా వేసింద‌ని ప‌లువురు అంటున్నారు. కీల‌క‌మైన మండలిలో బిల్లుకు గండాన్ని త‌ప్పించ‌లేక‌పోయింద‌ని చెప్తున్నారు. ప‌ర్‌ఫెక్ట్ టైమింగ్ మిస్ అవ‌డం వ‌ల్లే...టీడీపీ పైచేయి సాధించింద‌నే సిగ్న‌ల్స్ జ‌నంలోకి వెళ్లాయ‌ని అంటున్నారు. ఇప్ప‌టికైనా సెల‌క్ట్ క‌మిటీ ముందు త‌మ వాద‌న‌ల‌ను స‌మ‌ర్థంగా వినిపించి పైచేయి సాధించ‌క‌పోతే... వైసీపీ సెల్ఫ్ గోల్ చేసుకున్న‌ట్లు అవుతుంద‌ని పేర్కొంటున్నారు. సెలెక్ట్ కమిటీలో ఈ బిల్లు ప్రక్రియ ముగియడానికి కనీసం మూడు నెలలు పడుతుందని, అప్ప‌టిదాకా అధికార వైసీపీ ఈ విష‌యంలో ఓట‌మి భారాన్ని భ‌రించాల్సి రావ‌డం ఖాయ‌మంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: