తెలుగుదేశం పార్టీలో అసంతృప్తులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజయం అనంత‌రం మొద‌లైన ఈ పెద‌వి విరుపులు...ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న‌తో తారాస్థాయికి చేరాయి. అవి అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల నుంచి బ‌హిరంగంగా కామెంట్ చేసే వ‌ర‌కూ చేరిపోతున్నాయి. తాజాగా టీడీపీకి చెందిన సీనియ‌ర్ నేత‌, పార్టీ పెద్ద‌ల స‌భ స‌భ్యురాలు ఈ మేర‌కు టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు తీరుపై విరుచుకుప‌డ్డారు. తాడేపల్లిలో టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత మీడియాతో మాట్లాడుతూ, మండ‌లి ప‌రిణామాలు, పార్టీ ప‌రిస్థితిపై ఘాటుగా స్పందించారు. 

 

శాసన మండలి ఔన్యత్యాన్ని చైర్మన్ కలరాశారని టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. ``సభలో టీడీపీ సభ్యలు వ్యవహరించిన తీరు బాధాకరం. బిల్లు ఆగదని తెలిసి కూడా టీడీపీ సభ్యలు అడ్డుకున్నారు` అని మండిప‌డ్డారు. ప్ర‌తిప‌క్ష నేత‌, టీడీపీ అధ్య‌క్షుడు చంద్రబాబు గ్యాలరీకి రావాల్సిన అవసరం ఏముందని ఆమె సూటిగా ప్ర‌శ్నించారు. ``శాస‌న మండ‌లి చైర్మన్‌పై చంద్రబాబు రాజకీయ ఒత్తిడి తెచ్చారు. చంద్రబాబును ప్రజలు చీకొట్టిన బుద్ది రాలేదు. శాసన మండలిని చంద్రబాబు భ్ర‌ష్టు పట్టించారు. శాసన మండలి సభ్యరాలిగా నేను బాధ పడ్డాను.`` అని అన్నారు. చంద్రబాబు మాయ నుంచి టీడీపీ సభ్యులు బ‌య‌టకు రావాలని, బిల్లుకు ప్రతి సభ్యుడు మద్దతు తెలపాలని సునీత కోరారు.

 


ఒక పార్టీకి చైర్మన్ గా షరీఫ్ వ్యవహరించారని పోతుల సునీత‌ ఆరోపించారు. చట్టానికి విరుద్ధంగా చైర్మన్ వ్యవహరించారని ఆక్షేపించారు. ``సెలెక్ట్ కమిటీకి బిల్లులు పంపడం  చరిత్రలో ఒక మచ్చ గా మిగిలిపోతుంది. అభివృద్ధి పరిపాల వికేంద్రీకరణను అడ్డుకోడానికి బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారు.`` అని ఆరోపించారు. త‌న గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని ఆమె పేర్కొన్నారు. ``ప్రలోభాలకు గురికావాల్సిన అవసరం మాకు లేదు.` అని అన్నారు. 

 


బిల్లు సెలెక్ట్ కమిటీకి ఇవ్వడంపై టీడీపీ ఎమ్మెల్సీలు చాలా బాధ పడుతున్నారని పేర్కొన్నారు. ``చంద్రబాబు మాటలు విని మోసపోయామని ఆవేదన చెందుతున్నారు. అందుకే, టీడీపీ ఎమ్మెల్సీలు చేసిన తప్పు సరిదిద్దుకోవాలి. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే సీఎం మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం రాజకీయాలు పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా సీఎం జగన్ కు మద్దతు ఇవ్వాలి.` అని తెలిపారు. శాస‌న‌మండలి రద్దుపై సీఎం ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటానని పోతుల సునీత స్ప‌ష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: