అమ‌రావ‌తి...ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్‌. ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మం, తెలంగాణ విడిపోవ‌డం, హైద‌రాబాద్ ప‌దేళ్ల ఉమ్మ‌డి రాజ‌ధాని...పైగా రాజ‌కీయ నేత‌ల నిర్ణ‌యాల‌తో దాదాపు రెండేళ్ల‌లోపే ఆ ప్రాంతాన్ని వ‌దిలి వ‌చ్చి ప్ర‌పంచం అబ్బుర‌పోయే రాజ‌ధాని నిర్మిస్తాం అనే నేత‌ల ప్ర‌క‌ట‌న‌ల ప‌ర్వంలో...ఐదేళ్లు గ‌డిచిపోయిన ప‌రిస్థితి. ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ పేరుతో...రాష్ట్రమంతా అభివృద్ధి ఫ‌లాలు అందాల‌నే ల‌క్ష్యంతో ప్ర‌స్తుత స‌ర్కారు మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌కు తెర‌లేపింది. దీనిపై స‌హ‌జంగానే భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే, ఇదే స‌మ‌యంలో ఇంకో కీల‌క డిమాండ్ ఊహించ‌ని రీతిలో తెర‌మీద‌కు వ‌చ్చింది. 

 

రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్క‌ర్ ద‌క్షిణ భార‌త‌దేశంలో భార‌త ప్ర‌భుత్వ రెండో రాజ‌ధాని ఉండాల‌ని   చేసిన‌ సూచన‌తో గ‌త ఏడాది `భార‌తదేశ రెండో రాజ‌ధానిగా హైద‌రాబాద్‌` అనే ప్ర‌చారం జోరుగా సాగింది. అయితే ఇప్పుడు ఆ డిమాండ్ హైద‌రాబాద్ నుంచి అమ‌రావ‌తికి మ‌ళ్లింది! అమ‌రావ‌తిని దేశానికి రెండో రాజధానిగా చేయాలట‌, ఇందుకోసం ప్రధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీని ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఒప్పించాలట‌. ఈ మేర‌కు కొత్త చ‌ర్చ‌ను తెర‌మీద‌కు తెచ్చారు బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేశ్‌.

 


ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ‌లో భాగంగా రాజ‌ధానిని మార్చాల‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ బ‌లంగా నిర్ణ‌యం తీసుకుంటే...అందుకోసం అమ‌రావ‌తి దేశ రాజ‌ధానిగా చేయ‌డం ఉత్త‌మ‌మైన నిర్ణ‌యం అవుతుంద‌ట‌. త‌ద్వారా, అమ‌రావ‌తి మార్పుతో న‌ష్ట‌పోతున్న అక్క‌డి రైతుల‌కు జ‌గ‌న్‌ న్యాయం చేసిన వ్య‌క్తి అవుతార‌ని టీజీ చెప్పుకొచ్చారు. ఇక త‌మ క‌ర్నూలు గురించి పేర్కొంటూ అసెంబ్లీ శీతాకాల, వేస‌వి కాల స‌మావేశాల‌ను క‌ర్నూలులో నిర్వ‌హించాల‌ని ఆయ‌న కోరారు. త‌మ జిల్లాతో పాటుగా విశాఖ‌ప‌ట్ట‌ణంలో కూడా హైకోర్ట్‌ బెంచ్ ఏర్పాటు చేయాలని ఆయ‌న సూచించారు. న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిగా కేంద్రంగా మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాలకు ఈ కొత్త డిమాండ్ తోడ‌యింద‌ని ప‌లువురు కామెంట్లు చేస్తున్నారు. ఇంత‌కీ ఈ స‌ల‌హా టీజీ వ్య‌క్తిగ‌త‌మా?  బీజేపీ వైఖ‌రా అనేది అస‌లు డౌట్‌

మరింత సమాచారం తెలుసుకోండి: