ఏపీ శాసన మండలిని రద్దు చేయాలని దాదాపుగా నిర్ణయించుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి అందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు. పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే ముకుల్ రోహత్గీ వంటి సీనియర్ న్యాయనిపుణులతో చర్చించిన జగన్ ఇందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో సోమ వారం కీలక రోజు కానుంది.

 

ఎందుకంటే.. సోమవారం ఉదయం 9.30 గంటలకు కేబినెట్‌ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భేటీలో శాసన మండలి రద్దుపై చర్చించే అవకాశముంది. ఆ తర్వాత 11 గంటలకు శాసనసభ సమావేశం అవుతుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో సీఎం జగన్‌ అధ్యక్షతన ఈ కేబినెట్‌ భేటీ జరగుతుంది. ఈ కీలక సమావేశంలో శాసన మండలి రద్దుపై తీర్మానం చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఆ తర్వాత దాన్ని ఆమోదించే అవకాశముంది.

 

ఆ తర్వాత శాసనసభలో తీర్మానం ప్రవేశపెడతారు. దానిపై చర్చించిన తర్వాత ఆమోదం తెలుపుతారు. శాసన సభలో ఆమోదం పొందిన తర్వాత బిల్లును పార్లమెంట్‌ ఆమోదం కోసం పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మండలి రద్దు ప్రక్రియ చాలా క్లిష్టమైనదిగా చెబుతున్నారు. రాష్ట్రం తీర్మానం చేసి పంపినా దాన్ని కేంద్రం అంగీకరించాలని లేదు.

 

శాసన మండలి రద్దు విషయంలో కేంద్రానిదే తుది నిర్ణయం. రాష్ట్రం పంపిన తీర్మానాన్ని ఎంతకాలానికి కేంద్రం పార్లమెంటు ఆమోదానికి పెట్టాలన్న అంశంపై నిర్ణీత సమయం అంటూ లేదు. సో.. కేంద్రం అండదండలు లేకుండా మండలి రద్దు ప్రక్రియ చురుకుగా సాగే అవకాశాలు తక్కువ. అయితే ఈ మేరకు జగన్ ఇప్పటికే కేంద్రం పెద్దల ఆమోదం పొందారని కూడా కొందరు వైసీపీ నాయకులు చెబుతున్నారు. అదే నిజమైతే.. మండలి రద్దు ప్రక్రియ చురుకుగా కదిలే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: