శాసనమండలిని రద్దు చేయాలని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ , ఇప్పటికిప్పుడే మండలి రద్దయ్యే అవకాశాలు లేవా ? అంటే అవుననే పరిశీలకులు చెబుతున్నారు . గతం లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు కూడా తాను అధికారం లోకి వచ్చిన కొత్తలో మండలి ని రద్దు చేయాలని నిర్ణయించారు . అయితే 1983లో మండలిని రద్దు చేయాలని శాసనసభ లో తీర్మానం చేసి , పార్లమెంట్ కు నివేదిస్తే 1985 లో మండలి రద్దయిందని గుర్తు చేస్తున్నారు .

 

అంటే దాదాపు రెండేళ్ల సమయం పట్టిందని పరిశీలకులు పేర్కొంటున్నారు . అయితే ఇప్పుడు కూడా రెండేళ్ల సమయం పడుతుందా ?, లేకపోతే అంతకంటే ముందే మండలి రద్దవుతుందా ?? అన్నది కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు . ఉభయ సభల్లో మండలి రద్దు ఆమోదం పొంది ఆ తరువాత రాష్ట్రపతి వరకు బిల్లు వెళ్లే ప్రక్రియ ఎంత  త్వరగా పూర్తవుతుందన్న దానిపై మండలి భవితవ్యం ఆధారపడి ఉంటుందని పరిశీలకులు పేర్కొంటున్నారు . అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపధ్యం లో,   వైస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మండలిని రద్దు చేయాలనుకుంటే, మండలి రద్దుకావడానికి ఒకవేళ రెండేళ్ల సమయం పడితే మాత్రం ఆ పార్టీకి తీసుకున్న నిర్ణయం ఆత్మహత్య సదృశ్యమే అవుతుందని పరిశీలకులు అంటున్నారు .

 

ఎందుకంటే  మరో రెండేళ్ల వ్యవధిలో  వైస్సార్ కాంగ్రెస్  పార్టీకి  మండలిలో పూర్తి  మెజార్టీ లభించే అవకాశముందని గుర్తు చేస్తున్నారు .  ప్రస్తుతం టీడీపీ తరుపున మండలికి ప్రాతినిధ్యం వహిస్తోన్న మెజార్టీ సభ్యుల పదవీకాలం మరో ఏడాది , రెండేళ్ల వ్యవధిలో పూర్తి కానుందని చెబుతున్నారు . శాసనసభలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కి ఉన్న బలాన్ని ఆధారంగా చేసుకుని , మెజార్టీ స్థానాలు ఆ పార్టీ ఖాతాలోకి వెళ్లనున్నాయని పేర్కొంటున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: