తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 22న నిర్వహించిన మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉద‌యం జరుగనుంది. 120 మున్సిపాలిటీలు, తొమ్మిది కార్పొరేషన్లకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్ప‌టికే విడుదలచేసింది.  అయితే, ఒక్క కార్పొరేష‌న్‌లో మాత్రం ఫలితాలు విడుద‌ల కావ‌డం లేదు. అదే  కరీంనగర్‌ కార్పొరేషన్‌.

 

కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 60 డివిజన్లున్నాయి. వాటిలో రెండు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుపొందారు. 20వ డివిజన్ లో తుల రాజేశ్వరి, 37వ డివిజన్‌ లో చల్ల స్వరూపారాణి పోటీ లేకుండా విజయం సాధించారు. దీంతో, మిగిలిన 58 స్థానాలకు ఎలక్షన్ నిర్వహించారు. కార్పొరేష‌న్‌లో మొత్తం 2 లక్షల 72వేల 195 మంది ప్రజలు ఓటు హ‌క్కు క‌లిగి ఉన్నారు. వారి కోసం 348 పోలింగ్‌  కేంద్రాలను అందుబాటులో ఉంచారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగ్గా… 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. మొత్తం 371 మంది అభ్యర్థులు భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. బ్యాలెట్ బాక్స్‌లను సీల్ వేసిన తర్వాత… ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలలో భద్రపరచనున్నారు. ఈ నెల 27వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ చేపట్టి, ఫలితాలను  ఈసీ వెల్లడించనుంది. మొత్తం 371 మంది అభ్యర్థుల అదృష్టం ఆ రోజు బ‌య‌ట‌ప‌డ‌నుంది.

 


మ‌రోవైపు, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కోసం మున్సిపాలిటీలకు 120, కార్పొరేషన్లకు 9 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఓట్లను వార్డులవారీగా లెక్కించనున్నారు. ఒక్కో వార్డులో 1200 నుంచి 1800 వరకు ఓట్లు ఉన్నాయి. ఒక్కో వార్డుకు రెండు టేబుళ్లను ఏర్పాటుచేస్తారు. గంట వ్యవధిలో లెక్కింపు పూర్తవుతుందని అంచనావేస్తున్నారు. ఒక మున్సిపాలిటీలో 20 వార్డులు ఉంటే 40 టేబుళ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. లెక్కింపు ప్రక్రియ త్వరగా ముగిసినా.. రికార్డులు రాయడానికి కొంత సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: