తెలంగాణ రాష్ట్రంలో తాజాగా ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొత్త పాలకవర్గాలు కొలువుదీరేందుకు సంబంధించిన కీల‌క ఘ‌ట్టం నేడు జ‌ర‌గ‌నుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 22న నిర్వహించిన మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు నిర్వ‌హించ‌నున్నారు. 120 మున్సిపాలిటీలు, తొమ్మిది కార్పొరేషన్లకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఓట్లను వార్డులవారీగా లెక్కించనున్నారు. ఒక్కో వార్డులో 1200 నుంచి 1800 వరకు ఓట్లు ఉన్నాయి. ఒక్కో వార్డుకు రెండు టేబుళ్లను ఏర్పాటుచేస్తారు. గంట వ్యవధిలో లెక్కింపు పూర్తవుతుందని అంచనావేస్తున్నారు. ఒక మున్సిపాలిటీలో 20 వార్డులు ఉంటే 40 టేబుళ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అయితే, ఫలితం విష‌యంలో వివాదం నెల‌కొంటే...ఎవ‌రు ప‌రిష్క‌రిస్తార‌నే దానిపై మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల అయ్యాయి.

 


ఓట్ల లెక్కింపునకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం విడుదలచేసింది. బ్యాలెట్‌ పత్రాల పరిశీలన, తిరస్కరణ నుంచి ఫలితాలను వెల్లడించడం వరకు రిటర్నింగ్‌ అధికారులదే (ఆర్వో) పూర్తి అధికారమని స్పష్టంచేసింది.  ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా తిరస్కరించే బ్యాలెట్‌ పత్రాలపై అంతిమ నిర్ణయం రిటర్నింగ్‌ అధికారిదేనని తేల్చిచెప్పంది. బ్యాలెట్‌ పేపర్‌ను తిరస్కరించడానికి ముందు సమగ్రంగా పరిశీలించి.. సంక్షిప్తంగా తిరస్కరిస్తున్నట్లు రూఢీచేసి.. వెనుక భాగంలో కారణాలను లిఖిత పూర్వకంగా పేర్కొనాలని ఎన్నికల సంఘం మార్గదర్శకాలలో పేర్కొన్నారు. 

 

ఒక అభ్యర్థి వేసిన గుర్తు బ్యాలెట్‌ పత్రం మడత సందర్భంగా ప్రతిబింబంగా ఉంటే.. ఆ బ్యాలెట్‌ను చెల్లుబాటు చేయాలని సూచించారు. ఒక అభ్యర్థికి ఓటు గుర్తు వేసిన తర్వాత ఇంకో అభ్యర్థి కాలమ్‌లో సిరా అయినా.. చేతి మరక అయినా పడితే దాన్ని కూడా చెల్లుబాటు చేయాలని.. ఓటు గుర్తు పడిన అభ్యర్థికి దాన్ని నమోదు చేయాలని పేర్కొన్నారు. బ్యాలెట్‌ పేపర్‌లో ఒకే అభ్యర్థికి అతని కాలమ్‌లో నాలుగైదు చోట్ల ఓటు గుర్తు పడినా అదికూడా చెల్లుతుందని తెలిపారు. రిజెక్ట్‌ జాబితాలో ఉన్న నియమావళిని ఆర్వోలు పరిశీలించాలని స్పష్టంచేశారు. ఈ మేర‌కు ఓట్ల లెక్కింపు అధికారులకు ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో శిక్షణను ఇచ్చింది. లెక్కింపు సిబ్బంది అంతా విధుల్లో ఉన్నట్లు ఎస్‌ఈసీ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: