తెలుగుదేశం  పార్టీని రాజకీయంగా ఇరకాట పెట్టే ఏ ఒక్క అవకాశాన్ని అధికార వైస్సార్ కాంగ్రెస్ పార్టీ వదులుకునే అవకాశాలు కన్పించడం లేదు . ఒకవైపు తమ ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తూనే  , మరొక వైపు  ప్రతిపక్ష టీడీపీ అనుసరిస్తున్న  వైఖరిని ఎండగట్టాలని నిర్ణయించింది .  పరిపాలన వికేంద్రీకరణ , సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను శాసన మండలిలో తమకు మెజార్టీ ఉందనే  కారణంగా  సెలెక్ట్ కమిటీ కి పంపడం పట్ల అధికార వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం తో రగిలిపోతున్న విషయం తెల్సిందే .

 
 మండలిలో టీడీపీ అనుసరించిన తీరును నిరసిస్తూ , వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్వర్యం లో రాష్ట్ర వ్యాప్తంగా యువజన , విద్యార్థి జేఏసీ లతో కలిసి నిరసనలు , ఆందోళనలు కార్యక్రమాల నిర్వహణ కు సన్నాహాలు చేస్తోంది  . అధికార , పరిపాలన వికేంద్రీకరణ ద్వారా 13 జిల్లాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లేందుకు ఈ కార్యక్రమాలను వేదికగా చేసుకోవాలని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది .   విద్యార్థి , యువజన సంఘాలతో కలిసి నిర్వహించే  నిరసనలు , ఆందోళన కార్యక్రమాల బాధ్యతను పార్టీ ఎంపీలు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు తీసుకోవాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది . ఈ నెల 25వ తేదీన పార్టీ విద్యార్థి విభాగం అద్వర్యం లో  రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేయాలని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిర్ణయించింది . 

 

ఈ నెల 27 న యువజన విభాగం ఆద్వర్యం బైక్ ర్యాలీలు , పాదయాత్రలు చేపట్టాలని నిర్ణయించగా , 28 న విద్యార్థి విభాగం ఆద్వర్యం  విశ్వవిద్యాలయాల వద్ద సదస్సులు , 29న ప్రధాన కూడళ్లలో సంతకాల సేకరణ , 30న రాష్ట్రపతి పోస్టు కార్డులు పంపాలని నిర్ణయించారు . ఇక ఈనెల 31 న మూడు ప్రాంతాల జేఏసీ నాయకులతో సమావేశం నిర్వహించి టీడీపీ తీరును ప్రజల్లో ఎండగట్టాలని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది .

 

మరింత సమాచారం తెలుసుకోండి: