రాజధాని వికేంద్రీకరణ బిల్లు విషయంలో తలెత్తిన సమస్యలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏకంగా మండలినే రద్దు చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. దీని కోసం సోమవారం నుంచి  మరో దఫా అసెంబ్లీని సమావేశపరుస్తున్నారు. జనవరి 27న మంత్రివర్గ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. మండలి రద్దు జగన్ కు కూడా రాజకీయంగా ఒత్తిడిని పెంచుతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీట్ల సర్దుబాటులో భాగంగా చాలా మందికి జగన్ అప్పట్లో ఎమ్మెల్సీ హామీలు ఇచ్చారు. ఇప్పుడు అది కూడా రద్దు అయితే..పదవుల పంపకం సమస్యలు వస్తాయని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.


 మరో పక్క  ఓ వైపు ఏపీలో బలపడేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్న బిజెపి జగన్ సర్కారు కోరినట్లు మండలిని రద్దు చేసి ఏ చట్ట సభలోనూ తమ పార్టీకి   ప్రాతినిధ్యం లేకుండా చేసుకుంటుందా?. లేక ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా బిల్లును పక్కన పడేస్తుందా?. ఇదే చర్చ ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కేంద్రంలో ఏకఛత్రాధిపత్యాన్ని చెలాయిస్తున్న ఆ పార్టీ తెలంగాణతోపాటు ఏపీలో పట్టు పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది. దీని కోసం పలు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో జనసేనతో కలసి బిజెపి ఏపీలో దూకుడు పెంచే ప్రయత్నాల్లో ఉంది. ఈ తరుణంలో రెండు సభల్లో ఎక్కడా కూడా ప్రాతినిధ్యం లేకుండా చేసుకుంటే ఆ పార్టీకే నష్టం కనుక జగన్ సర్కారు నిర్ణయాన్ని ఏ మేరకు బిజెపి రాజకీయంగా ఆమోదిస్తుంది అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.


ఏపీ రాష్ట్ర అసెంబ్లీలో బిజెపికి అసలు ప్రాతినిధ్యమే లేదు. ప్రస్తుతం మండలిలో బిజెపికి అధికారికంగా ఇద్దరు సభ్యులు ఉండగా..టీడీపీ తరపున మండలికి ఎన్నికైన వాకాటి నారాయణరెడ్డి బిజెపి గూటికి చేరారు. ఆయనతో కలుపుకుంటే మండలిలో బిజెపి సభ్యులు ముగ్గురు ఉన్నట్లు అవుతుంది. ఈ పరిస్థితుల్లో బిజెపి మండలి రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వెంటనే ఓకే అనటం అనుమానమే అని చెబుతున్నారు. మరి ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఏ మేరకు తన పంతాన్ని నెగ్గించుకుంటారో వేచిచూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: