రాజకీయాల్లో రాణించే అంత శక్తి సామర్ధ్యాలు లేకపోయినా... కేవలం తన తండ్రి పలుకుబడి ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఆ పార్టీ నాయకులతో జై జైలు కొట్టించుకుంటున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రస్తావన మరోసారి తెర మీదకు వస్తోంది. శాసనమండలిని రద్దు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో లోకేష్ పరిస్థితి ఏంటి అనేది చర్చగా మారింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోవడంలోనూ, ఎత్తులకు పై ఎత్తులు వేయడంలోనూ లోకేష్ పనితీరు అంతంత మాత్రమే అన్న సంగతి అందరికీ తెలుసు. గతంలో ఎంతోమంది సీఎంలు, మంత్రులు వారి కుటుంబాలను రాజకీయాల్లోకి తీసుకు వచ్చినా వారిలో సక్సెస్ అయ్యింది మాత్రం అతి కొద్ది మంది మాత్రమే. 


ఏపీ సీఎం జగన్ కూడా రాజశేఖర్ రెడ్డి పలుకుబడితో రాజకీయాల్లోకి వచ్చినా ఆ తర్వాత ఆయన సొంతంగా పార్టీ పెట్టుకుని, ఎవరి సహకారం లేకుండానే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఈ స్థాయికి రావడమే కాకుండా బలమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అటువంటి జగన్ తో లోకేషన్ పోల్చిచూస్తే వీరిద్దరి మధ్య తేడా సరి చూడడానికి కూడా అందనంత దూరంలో ఉంటుంది. లోకేష్ రాజకీయాల్లో కి వచ్చిన దగ్గర నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు. ఆయన బలవంతంగా రాజకీయాలు చేస్తున్నారే తప్ప, ప్రజా నాయకుడిగా, పార్టీ నాయకులకు భరోసా ఇచ్చే ప్రయత్నం మాత్రం చేయలేకపోతున్నారు.


 2014 లో టిడిపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 2017 వరకు లోకేష్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ 2017 లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో లోకేష్ కు కేబినెట్ మంత్రిగా అవకాశం కల్పించారు చంద్రబాబు. దీనికోసం నాలుగు రోజుల ముందే ఎమ్మెల్సీ పదవిని సైతం కట్టబెట్టారు. ఇక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్, తన సొంత ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేశారు. కానీ అదే సమయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేయడంలో విఫలం అయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ గురించి, తన గురించి ప్రజల అభిప్రాయం ఏమిటి తెలుసుకుని, ఆ లోటు పాట్లను సరిద్దిద్దుకునే ప్రయత్నం ఆయన చేయలేదు. ఫలితంగా గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.


 ఎన్నికల ప్రచారానికి తన భార్య, తల్లిని రంగంలోకి దింపి ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. మంగళగిరిలో లోకేష్ ఓటమిని ఇప్పటికీ చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, ఆ పార్టీ శ్రేణులు ఇలా ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం శాసన మండలి రద్దవుతున్న నేపథ్యంలో లోకేష్ రాజకీయ జీవితం ఏంటి అనేది ప్రశ్నగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: