ఏపీ ప్రభుత్వం రాజధాని విశాఖకు తరలించే ప్రయత్నాన్ని ఎన్ని పరిస్థితుల్లోనూ విరమించుకునేలా లేదు. ఎన్ని అవాంతరాలు ఎదురయినా ముందుకు వెళ్లేందుకే ప్రయత్నిస్తోంది. అసెంబ్లీలో సైతం బిల్లును పాస్ చేయించుకున్న నేపథ్యంలో ఆ బిల్లు శాసనమండలిలో పెండింగ్ లో ఉంది. ఆ బిల్లుని సెలక్ట్ కమిటీకి పంపిస్తూ మండలి చైర్మన్ నిర్ణయం తీసుకోవడంతో పెద్ద దుమారమే రేగుతోంది. మండలిని రద్దు చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా విశాఖ రాజధానిగా అయ్యే అవకాశం ఉండడంతో అమరావతి లో పరిస్థితి ఏంటి అనేది చర్చకు వస్తోంది. 


టీడీపీ ప్రభుత్వంలో రాజధానిగా అమరావతి వెలుగొందడంతో ముఖ్యంగా ఈ ప్రాంతంలో భూమి ధరలు భారీగా పెరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలో కి వచ్చాక అమరావతి విషయంలో సానుకూల దృక్పధం లేకపోవడం వీటి కారణంగా పూర్తిగా రియల్ ఎస్టేట్ పై ప్రభావం పడింది. గతంలో కోట్లాది రూపాయలు పలికిన ధరలు ఇప్పుడు కొనేవారు లేక వెలవెలబోతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినడంతో ధరలు తగ్గించలేక, కొనే వారు లేక సతమత మవుతున్నారు. 


గతంలో నోట్ల రద్దు, ఆర్థిక సంక్షోభం తదితర కారణాలతో మందగమనంలో  ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆ తర్వాత పూర్తిగా చతికలబడింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలయింది. గతంలో అమరావతి ప్రాంతంలో గజం 25,000 పలికిన ధర ఇప్పుడు 18 వేలకు అంతకంటే తక్కువ ధరకు వస్తున్నా కొనేవారు లేక రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. ప్రస్తుతం అమరావతి పరిసర ప్రాంతాల్లో భూములు పొలాలు కొనుగోలు చేసేందుకు ఎవరూ పెద్దగా ముందుకు రావడంలేదు. ఏది ఏమైనా అమరావతిలో రాజధాని ఉండే అవకాశం లేదనే వార్తలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా దెబ్బతిందనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: