ఆడవారి రక్షణకై ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. వారిపై జరుగుతున్న దాడులు మాత్రం అస్సలు ఆగడంలేదు. తాజాగా సికింద్రాబాద్ లో జరిగిన  మరొక దారుణ ఘటన  కలకలం రేపుతోంది. వివరాల్లోకి పోతే, సికింద్రాబాద్ లోని వారాసిగూడ ప్రాంతానికి చెందిన ఓ 17ఏళ్ల బాలిక సమీపంలోనున్న ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. తన తండ్రి మూడేళ్ళ క్రితమే మరణించడంతో ఆమె తల్లి టైలరింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.

 

 

అయితే ఈ బాలిక పాఠశాలలో చదివే రోజుల్లో తనకి సీనియర్ అయిన సోహెబ్ తో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ విధంగా వీరిద్దరి మధ్య రెండేళ్లపాటు ప్రేమాయణం కొనసాగింది. అయితే ఒకరోజు సోహెబ్ బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పి తన తల్లిదండ్రులతో పాటు.. అమ్మాయి వారి ఇంట్లో కూడా చెప్పాడు. దీంతో ఇరు కుటుంబాలు వీళ్ళ పెళ్ళికి అభ్యంతరం చెప్పారు. అదేవిధంగా వీరి విషయం పెద్దల దాకా వెళ్ళింది. పెద్దలు కూడా వీరి పెళ్లికి నిరాకరించడంతో.. బాలిక సోహెబ్ కి దూరంగా ఉంటుంది. దీంతో అమ్మాయిపై బాగా కోపం పెంచుకున్నాడు సోహెబ్. 

 

 

గురువారం రోజు బాలిక తన ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న వారింట్లో జరుగుతున్న శుభకార్యానికి వెళ్ళింది. అది గమనించిన సోహెబ్.. 'టెర్రస్ పైకి వస్తే నీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతా' అని ఆమెకు మెసేజ్ చేశాడు. దీంతో ఆమె టెర్రస్ పైకి వెళ్లి అతన్ని కలిసింది. అప్పుడు సోహెబ్ తనని పెళ్లి చేసుకోమని ఆమెను అడిగాడు. దాంతో వాళ్ళిద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంలోనే తీవ్రమైన ఆగ్రహానికి గురైన సోహెబ్.. ఒక పదునైన గ్రానైట్ రాయిని బాలిక గొంతులో పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత ఆమెను ఈడ్చుకుంటూ వెళ్లి భవనంపై నుండి కిందకి పడేసాడు. 

 

 

మరుసటి రోజు అనగా శుక్రవారం తన కుమార్తె కనిపించక పోవడంతో తల్లి చుట్టుపక్కల అంతా వెతికింది. ఈ క్రమంలోనే టెర్రస్ పైకి వెళ్ళిన ఆమెకు.. రక్తపు మరకలు కనిపించాయి. రక్తపు మరకలను అనుసరిస్తూ వెళ్లిన ఆమెకి.. కింద పడి ఉన్న తన కుమార్తె శవం కనిపించింది. వెంటనే ఆమె తన కుమార్తె మృతదేహం వద్దకు వెళ్లి గట్టిగా ఏడవసాగింది. దీంతో స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.

 

 

హుటాహుటిన హత్య జరిగిన ప్రాంతానికి వచ్చిన పోలీసులకు బాలిక తల్లి సోహెబ్ గురించి చెప్పింది. తరువాత సాహెబ్ ను పోలీసులు విచారించగా... తానే హత్య చేశానని అంగీకరించాడు. పోలీసులు అతడిపై ఐపీసీ 302, 201, 354–డీతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బాలిక మరొక అబ్బాయి తో చాటింగ్ చేస్తుందని, అందుకే తనని దూరం పెడుతుందని అనుమానపడిన సోహెల్ ఆమెను హతమార్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: